14, జనవరి 2018, ఆదివారం

భూజనులు నిన్ను పొగడేరు రామా


రాజీవనేత్ర యని రామచంద్ర యని
భూజనులు నిన్ను పొగడెదరు రామా

పెద్దపెద్ద తెలికన్నుల వెడలి నీచూడ్కులు
మొద్దులు భూజనులపై ముసిరిన దయతో
తద్దయు వర్షించి వారి తప్పులన్నిటి గాచ
నిద్దపు ప్రేముడిని వారు నిను చాల పొగడెదరు

చల్లనైన వాడనుచు చందమామ నెన్నెదరు
చల్లనైన దొరవని జనులు నిన్ను తలచెదరు
ఎల్లవేళ లమృతాంశు డిచ్చునా వెన్నెలలవి
ఎల్లవేళ కృపామృత మిచ్చెదవని పొగడెదరు

వేనోళ్ళ నిన్ను పొగడు విబుధులందరి లోన
నేనెంతటి వాడనయ్య నీ నామధేయములు
మానస ముప్పొంగ నేను మరిమరి సంభావించి
ధ్యానించి నీమహిమ తరియించ నెంచెద