28, నవంబర్ 2016, సోమవారం

మనసు నిలకడలేని


మనసు నిలకడలేని మనుజుడ నైతి నా
మనసు నీపై నిలచు మాట యెక్కడిది

నిదురబోయెడు వేళ నీవు తలపున తోచ
నిదురలేచిన వెనుక నిన్ను పూజింప
మదిలోన నిశ్చయము మానక చేయుదు
నది సంతసము గూర్చ హాయిగా నిదురింతు
మనసు

నిదుర ముందటి బుద్ధినిశ్చయం బంతయు
నిదురలో సడలుట నిత్యకృత్యమ్మై
అదుపులేని వాంఛ లమితమోహంబును
మదిని ముప్పిరిగొన మొదలౌను దినచర్య
మనసు

అదిచేయు చిదికోరు చటునిటు తిరుగుచు
ఉదయమాదిగ దినమూరక బుచ్చి
హృదయంబులోన క్షోభింతు రామయ్య
నిదురబోయెడు వేళ నీవు తలపున తోచ
మనసు


(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)

23, నవంబర్ 2016, బుధవారం

మరల నింకొక మాట


మరల నింకొక మాట మనవిచేసెడు లోన
మరలిపోతివి నిన్న మంచి స్వప్నము లోన

చిరునవ్వు వెన్నెలలు చిక్కగా కురిపించి
మురిపించి ఎన్నెన్నొ ముచ్చటలు పలికి
నిరుపమానం బైన నీదయలు చిలికి
మరి నాదు పొగడికలు మన్నించి వినుచు
మరల

నా కడకు వత్తువు నన్ను మన్నింతువు
నీ కడకు మరియింక నేను వచ్చెదనని
వేడుక మీరగ వినయంబుతో‌ నిన్ను
వేడగ నెంచి నే విన్నవించగ నుండ
మరల

ఎన్నాళ్ళ నుండియో నన్నెఱుగుదు వీవు
అన్నియు నెఱుగి నాయాశ నీవెఱురగవా
ఇన్ని యాశలు దీర్చి యీయాశ దీర్చవా
యన్న మాటను నే నడుగ బోవుచునుండ
మరల


(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)

21, నవంబర్ 2016, సోమవారం

హరిమ్రోల నిలచు వారందరు నొకటే


హరిమ్రోల నిలచు వారందరు నొకటే
పరికింప భేద మావంతయు లేదు

తాపము లోర్వక దరికి జేరెడు వారు
శ్రీపతినిజతత్త్వజిజ్ఞాసువులు
ఆపన్నులును నర్థార్థులు జ్ఞాను
లా పరమాత్ముని కందరు నొకటే
హరి

సురలు సిధ్ధులు వసువులు గంధర్వులు
నరుగరుడోరగకిన్నరవరులు
నిరుపమకరుణాన్వితుడై యుండెడు
హరిశుభదృష్టికి నందరు నొకటే
హరి

వామన నరహరి పరశురామ హరి శ్రీ
రామకృష్ణాది శుభనామములను
ప్రేమమీఱ భావించు భాగవతు
లా మాధవునకు నందరు నొకటే
హరి



మ్రొక్కుదురో మానుదురో


మ్రొక్కుదురో మానుదురో నిక్కువంబుగ మీరే
చక్కగా నిశ్చయించి చనుడొక్క రీతిని

ఇక్కడ యీ భూమిపైన దక్కిన జీవితమే
చక్కనిదిది మా కిదే చాలును
ఎక్కడి స్వర్గమో యేదేవుడో యేల
మక్కువ లేదందురా మంచిది యటులే
మ్రొక్కుదురో

కారు బంధువులు సిరులు కావు సుమా రక్ష
పేరినకృపగల విభుని యట్లు
దారుణభవవార్ధిని తరియించ గోరిన
శ్రీరామచంద్రునే చింతించ వలెనని
మ్రొక్కుదురో

జీవుడు స్వతంత్రుడు చెడను బాగుపడను
దేవుడు మీ‌బాగుకోరు తెలియుడు
కావలసినదేమో గట్టిగా యోచించి
పోవుడొక్క విధమున బుధ్ధిశాలురై
మ్రొక్కుదురో



పరమపురుష నీ భక్తుడ


పరమపురుష నీ భక్తుడ నేనని
నరులు తిట్టితే నగుబాటేమి

నే నిటు నమ్ముట నా నిర్ణయ మిది
నానాటికి నా నమ్మకము
మానగు చున్నది మరి నీ దయచే
దానికి నితరుల దయయేమిటికి
పరమ

దయచూపించెడు ధర్మప్రభుడవు
భయములను వారింతువు
రయమున భవసంగ్రామరంగమున
జయమును నాకు సమకూర్చెదవు
పరమ

సమకూర్చెదవు సకలార్థంబులు
భ్రమలను బాపి పాలింతువు
ప్రవిమలనీలోత్పలశ్యామ రామ
చివరకు నీలో చేర్చుకొందువు
పరమ



16, నవంబర్ 2016, బుధవారం

కథ: వాగుడుకాయ


అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే? నీ నో రసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.
ఆయన పేరు గుర్తు లేదు.
ఆయన ముఖమూ గుర్తులేదు.
ఆ మాట మాత్రం అతనికి బాగా గుర్తుండి పోయింది.
ఐతేనేం, తన నోటిని అదుపులో ఉంచుకోవటం అతని వల్ల కాలేదు.
స్కూలు పిల్లలంతా అతనికి రాళ్ళడబ్బా అని పేరు పెట్టేశారు.
ఐనా అతడి నోరు మూతపడటానికి చచ్చినా ఒప్పుకోలేదు.


కాలేజీ స్టూడెంట్లందరూ ఛాటర్ బాక్స్ అని ముద్దు పేరు పెట్టారు.
బంధువులెప్పుడో వాగుడుకాయ అన్న పేరు ఖాయం చేసేశారు.
ఐతేనేం? నో రెంత ధాటీగా ఉండేదో, చదువుకూడా అంత ధాటీగానే నడిచేది మరి.
చిత్రం ఏమిటంటే, అతడికి దొరికిన ఉద్యోగం కూడా వాగటమే.
అంటే లెక్చరర్ అన్నమాట.


పెళ్ళిచూపుల్లో అమ్మాయి ముందు ఆట్టే వాగకు అని అమ్మ వార్నింగ్ ఇచ్చింది.
అవసరం ఐతే కాని నువ్వు మాట్లాడాల్సిన పనేమీ లేదు అని నాన్నగారు రూలింగ్ ఇచ్చారు.
అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా అని పెళ్ళికూతురు తండ్రి అడగ్గానే అమ్మా, నాన్నా, అన్నయ్యా కూడా కోరస్ పాడేసారు అబ్బెబ్బే అవసరం లేదండీ అని.
ఐనా అమ్మాయితో మాట్లాడనే మాట్లాడాడు.
అదృష్టం బాగుండి ఆ ఆమ్మాయి ముందు మొగమాటం అడ్దం రావటమూ, ఆ అమ్మాయి ఆట్టే అవకాశం ఇవ్వకపోవటమూ పుణ్యమా అని గండం గట్టెక్కింది లెక్చరర్ గారికి.
బావగారు మంచి మాటకారి అంటున్నారు బావమరదులు.


ఒక రోజు భార్యామణి క్లాసుతీసుకుంది.
మీ‌ లెక్చర్లేవో మీ స్టూడెంటు కుర్రాళ్ళ ముందు దంచుకోండి, అందరి ముందూ అస్తమానం అదేపనిగా మాట్లాడుతుంటే నాకు చిన్నతనంగా ఉంది అని.
ఎందుకు చిన్నతనం? ఎవరికైనా తెలియకపోతే చెబుతున్నాననేనా? అసూయపడుతున్నారల్లే ఉంది అని అన్నాడు.
అసూయా లేదు అప్పడాలూ లేవు. అంతా వాగుడుకాయ మహాప్రభో అంటున్నారు. తగ్గండి అంది చిరాగ్గా సతీమణి.
వట్టి ఇడియట్స్  అని ఉడుక్కుని తనకు ఎంత పెద్ద పేరుందో తన సత్తా ఎటువంటిదో తనకు ఎలాంటి ఎలాంటి పెద్దవాళ్ళ ప్రశంసలు వచ్చాయో అంతా వివరంగా ఆమెకు ఒక లెక్చరు వేసాడు.
మహాప్రభో చాలు చాలు వదలండి అనేసి ఆమె మధ్యలోనే లేచి చక్కాపోయింది.


పీహెడీ అంటారే అది కూడా అయ్యింది.
ఇప్పుడు అతడు పెద్ద ప్రొఫెసర్.
ఎంత బాగా మాట్లాడతారో అని పేరు పైగా.
ఇప్పుడు ఎవరెవరో పిలుస్తూ ఉంటారు. ఎవేవో పెద్దపెద్ద ఉపన్యాసాలు దంచుతూ ఉంటాడు.


పేరు పెరుగుతోంది.
సన్మానాలూ గట్రా జరగటం మామూలైపోయింది.
పుస్తకాలూ రాయటం మొదలు పెట్టాడు.
పేరున్నాయన పుస్తకం వ్రాస్తే పెద్దపెద్ద సభలు చేసి మరీ పొగుడుతారు.
తమాషా ఏమిటంటే ఆ పొగిడే వాళ్ళల్లో దాదాపు ఎవ్వరూ ఆ పుస్తకాన్ని ఆసాంతం చదవనే చదవరు. కొందరు అక్కడక్కడా చదువుతారు. కొందరు ముందుమాటలూ వెనకమాటలు చదివి వాటితోనే పొగడ్తలబండి లాగిస్తారు. కొందరి తరపున వేరే వాళ్ళు ఎవరో చదివి ఉపన్యాసం కాని నోట్ కాని సిధ్ధం చేస్తారు కూడా అప్పుడప్పుడు.  ఇలాంటి సభల్లో వినటానికి కూర్చునే వాళ్ళూ పిచ్చివాళ్ళు కాదు. స్టేజీమీది వాళ్ళంతా  ఉపన్యాసంలో ఆ పుస్తకాలని చదివినట్లు నటిస్తే, స్టేజీ ఎదురుగా ఉన్నవాళ్ళంతా విన్నట్లే నటిస్తారన్నమాట.
ఆ మధ్యన ఎవరో ఉపన్యాసకేసరి అని కూడా అన్నారు.


కొంచెం వాగ్ధాటి తగ్గింది. వయస్సు మీద పడింది కదా.
రిటైరై నాలుగేళ్ళు దాటినా ఇంకా సభలూ సమావేశాలూ అంటూ తిరుగుతూనే ఉన్నాడు.
కొంచెం ఓపిక కూడా తగ్గింది.  క్రమంగా తానై ముఖ్యం అనుకుంటే కాని అన్ని చోట్లకీ వెళ్ళటం తగ్గించాడు,
ఎన్నడూ లేనిది ఇంటి పట్టునే ఎక్కువ సేపు ఉండటం జరుగుతోంది.


ఇల్లంతా ఎంతో‌ నిశ్సబ్దంగా ఉంటోంది.
ఉండదా మరి?
పెద్ద కొడుకు ఎప్పుడో అమెరికా చెక్కేసాడు.
చదువుకు సాఫల్యం అమెరికా ఉద్యోగమే అన్న సూత్రం మధ్యతరగతిలోనే స్థిరపడిపోయిందే, ఇంక కాస్త బాగానే ఉన్న అతడి ఇంట్లో వేరేగా ఎలా ఉంటుంది.
సంతానం అంతా మితభాషులు.
వాళ్ళకు ఆట్టే మాట్లాడే అవకాశం వాళ్ళ నాన్న ఎప్పుడన్నా ఇస్తే కదా అని బంధువర్గంలో ఛలోక్తి
ఇంట్లో‌ రెండవకొడుకూ, కూతురూ ఉన్నా వాళ్ళ చదువులేమో తిరుగుళ్ళేమో. వాళ్ళలోకం వాళ్ళది.
భార్యామణి లోకం వేరే.
వయస్సు పై బడ్డాక ఆవిడ పూజలూ పునస్కారాలమీద పడింది.
నిత్యం వాటితోనే కాలక్షేపం.
ఇంకా ఏమన్నా ఖాళీ సమయం ఉంటే మేడమీది హాల్లో టివీలో ఇంగ్లీషు ఛానెళ్ళ షోలూ సినిమాలూ చూస్తుంది ఆవిడ.


ఇంటి పట్టునే ఉంటున్నా  అతడికి ఎవరితోనూ ఆట్టే మాట్లాడటం కుదరటమే లేదు.
తన పుస్తకాలకు ద్వితీయముద్రణల గురించి పనిచేస్తూనో, వాళ్ళు వీళ్ళూ పంపిన పత్రాలూ పుస్తకాలూ పరిశీలిస్తూనో ఎక్కువసమయం కాలక్షేపం చేస్తున్నాడు.
ఎప్పుడన్నా ఎంచుకున్న సభలకు వెళ్ళినా కొంచెం సమయమే ఇస్తున్నారు.
అందులోనూ ఎంత లౌక్యంగా అనీ? పెద్దవారు, మీరు ఐదు నిముషాలు మాట్లాడితే అదే పదివేలు. అదే చాలు, మిమ్మల్ని అంతకంటే కష్టపెట్టం అని.
కొన్ని సభల్లో ఐతే, ఏదో  ఆఖర్న హడావుడిగా ఒక నిముషం మీరు కూడా మాట్లాడండి అంటున్నారు.
మరికొన్ని సభల నిర్వాహకులు మరచిపోయినట్లు నటించి ఊరుకుంటున్నారు.
ఇంకా కొన్ని సభల్లో మొగమాటం లేకుండా అతడిని అసలు వేదిక మీదకు పిలవటమే లేదు,
నేనూ‌ మాట్లాడే పక్షంలో ఐతేనే వస్తాను అంటే ఏదో సభకు పిలవటానికి వచ్చిన ఒక పెద్దమనిషి చిత్రంగా చూసాడు.


అన్న అమెరికా పోతే తమ్ముడు అమలాపురం పోతాడా?
చదువు పూర్తి అవుతూనే అతగాడూ అమెరికా వెళ్ళిపోయాడు.
ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ రెండో కొడుకే‌ కాస్త నయం. ఉన్నంతలో వీలు చూసుకొని అప్పుడప్పుడూ తనతో కబుర్లు చెబుతూ‌ ఉండే వాడు.
వాడు కూడా దూరం కాగానే మొదటి సారి నిజంగా దుఃఖం వచ్చింది.
రెండు మూడు నెలలు దిగులుతో నోరు బందు ఐనంత పని అయ్యింది.


గోరుచుట్టుపై రోకటి పోటు అన్న సామెతను సమయానికి చక్కగా గుర్తుచేసింది అర్థాంగి.
కూతురికి మంచి అమెరికా సంబంధం కుదిర్చింది.
కాబోయే అల్లుడు మంచి యోగ్యుడట. ఇలా ఎమ్మెస్ చేయగానే అలా మంచి జాబ్ కొట్టేయటమూ, చకచగా మెట్లెక్కేసి ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్ ఐపోవటమూ కూడా జరిగాయట.
ఇదంతా ఏమీ నచ్చలేదు అతడికి.
అమ్మాయి కూడా అమెరికా పోతే ఎలా అని ఆక్రోశించాడు.
అమ్మాయి సుఖం చూడాలి కాని పిచ్చిపిచ్చి సెంటిమెంట్లేమిటీ‌ అని భార్యారత్నం చాలా పెద్ద క్లాసు తీసుకుంది.
ముక్తాయింపు ఏమిటంటే, కుటుంబవ్యవహారాలన్నీ ఇన్నాళ్ళూ తనే చూస్తోంది కాబట్టి అంతా తనే నిర్ణయిస్తుందట.
మౌనంగా ఉండిపోయాడు.


ఏమీ‌ తోచటం లేదు.
ఏమీ‌ చదవాలనీ రాయాలనీ‌ అనిపించటం లేదు.
ఎవరూ ఏ సభలకూ ఈ మధ్య పిలవటం లేదు.
ఇంట్లో తన సంగతి పట్టట్లేదు.
పిల్లలా దూరం.
దిగులు దినదిన ప్రవర్థమానం అవుతోంది.
కొంచెం  జబ్బుపడ్డాడు.
అమెరికానుండి ఆదుర్ధా పడుతూ ఫోన్లమీద ఫోన్లు వచ్చాయి.
భార్యామణి పూజలూ వ్రతాలూ జోరుచేసింది.
ఒకసారి హాస్పటల్ దర్సనం చేసుకొని వచ్చాడు.
ఇంటి దగ్గర కొన్నాళ్ళు బెడ్ రెష్ట్ అన్నారు.
భార్యామణి ఒక నర్సును ఏర్పాటు చేసింది.


అందరూ ఉన్న ఒంటరి జీవితం అతడిది
విరక్తితో తన మీద తనకే జాలో అసహ్యమో మొత్తానికి అలాంటిదేదో కలిగింది.
కొంచెం కోలుకున్నాక అధ్యాత్మిక గ్రంథాలు చదవటం మొదలు పెట్టాడు.
అసలు పూజలూ వగైరా తానూ మొదలు పెడితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అనుకున్నాడు.
కాని ఎన్నడూ జీవితంలో వాటి జోలికి పోని తాను ఇప్పుడు అలా చేస్తే అంతా నవ్వుతారని అనిపించి ఆగాడు.
అందుకే భార్య కలెక్షన్‌లో ఉన్న గ్రంథాలతో మొదలు పెట్టి దీక్షగా చదువుతూ ఉన్నాడు.


ఒకరోజు ఏదో పుస్తకం కోసం భార్య చదువుకునే పుస్తకాల గదికి వెళ్ళాడు.
అక్కడ ఆమె చదువుకుంటూ ఉంది.
భర్తకేసి తిరిగి  కనీసం చూడలేదు, పలకరింపు దేవుడెరుగు.
తనక్కావలసిన పుస్తకం తీసుకొని క్రిందికి వచ్చాడు తనగదికి.
ఒకటి రెండు గంటలు దాన్ని తిరగేసి తిరిగి పైకి వెళ్ళాడు ఆ పుస్తకాన్ని అరలో పెట్టెయ్యాలని.


భార్య ఇంకా చదువుతూనే ఉన్నట్లుంది.
ఎందుకో అనుమానం వచ్చింది.
కొంచెం పరీక్షగా చూసాడు.
ఒకటి రెండు సార్లు పిలిచాడు.
జవాబు లేదు.
దగ్గరకు వచ్చి కుదిపాడు భుజం పట్టి.
అలాగే ఒరిగిపోయిందావిడ.
స్థాణువైపోయాడు ఒక్క నిముషం పాటు.


ఎవరెవరో వచ్చారు ఊళ్ళో నుండీ, పొరుగూళ్ళ నుండీ.  ఓదార్చి వెళ్ళిపోయారు.
పిల్లలూ వచ్చారు ఎకాయెకి అమెరికా నుండి. ఓదార్చి వెళ్ళిపోయారు.
నర్సుపిల్ల వచ్చింది. దయగల అమ్మగారు దయగల అమ్మగారు అంటూ ఏడ్చి వెళ్ళింది.
లంకంత ఇంటిలో ఒంటరిగా మిగిలి పోయాడు.


దినచర్య మారింది.
ఇప్పుడు పూజగదిలో తానే కూర్చుని పూజచేస్తున్నాడు.
అదీ వీలైనంత ఎక్కువసేపు చేస్తున్నాడు.
నర్సుపిల్ల ఎవరో వంటావిడను మాట్లాడిపెట్టింది.
ఆవిడ వండినది తినటం.
ఆవిడ కేది యిష్టమైతే అది చేస్తుంది.
మీ‌కేం కూరలు యిష్టం, ఏ పచ్చళ్ళు యిష్టం లాంటి ప్రశ్నలు ఆవిడ ఎప్పుడూ వేయలేదు.


కొడుకులూ కూతురూ ఎంతో అభిమానంతో‌ అగ్గగ్గలాడిపోతూ తరచూ ఫోన్ చేస్తూనే ఉంటారు.
ఎలా ఉందీ ఆరోగ్యం, సరిగా మందులు వేసుకుంటున్నారా అని ఎంతో ఇదిగా వాకబు చేస్తూ ఉంటారు.
ముక్తసరిగా అలాగే, అలాగే, వేసుకుంటున్నాను, బాగానే ఉంది అంటూ జవాబులు చెబుతూ‌ ఉంటాడు.


వంటావిడకో మనవడున్నాడు.
మంచివాడు పాపం.
స్కూలుకు సెలవు వచ్చిన నాడు బామ్మతో పాటే వచ్చి భలే హడావుడి చేస్తాడు.
స్వయంగా తానే డాక్టరు దగ్గరకు తీసుకొని వెడతాడు.
ఒకరోజున డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే డ్రైవర్ సమయానికి రాలేదు.
వంటావిడ మనవడు తానే ఇంటి యజమాని ఐనంతగా ఆ డ్రైవరుమీద మండిపడిపోయాడు.
అది చూస్తే ఎంత ముచ్చటేసిందో!


ఈ వేళ బామ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు పిల్లాడు.
చూడు బామ్మా,  తాత్తయ్యగారు పదిమాటలకు ఒక్క మాటే జవాబు చెబుతారు, అదీ‌ అప్పుడప్పుడూ అని.
వంటావిడ కసురుకుంది. ఒరే, నువ్వైతే వాగుడుకాయవి. అందరూ నీలాగే ఉంటారా అని.


చప్పున గుర్తుకు వచ్చింది.
అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే? నీ నో రసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.
ఆయన పేరు గుర్తు లేదు.
ఆయన ముఖమూ గుర్తులేదు.
ఆ మాట మాత్రం బాగా గుర్తుండి పోయింది.


చాలా కాలం తరువాత పెదవులమీదకు చిరునవ్వు వచ్చింది.



(గమనిక: ఈకథను  2014-11-10న ఈమాట పత్రికవారికి పంపాను.  13వ తారీఖున వారు దీనిని ప్రచురణార్హం కాదని నిర్ణయించినట్లుగా వారు నాకు తెలియజేసారు. ఈరోజున అప్రచురితంగా ఉన్న టపాలను పరిశీలిస్తుంటే ఇది కనిపించింది. దీనిని చదువుతుంటే  కొద్ది రోజులక్రిందట తెలుగుకు శిక్ష అన్న ఈమాటలోని కథ క్రింద నేను వ్రాసిన వ్యాఖ్యలో నేనన్న మాట గుర్తుకు వచ్చింది. అది "సందర్భం అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఈ‌మాటను కూడా చెబుతాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి కూడా ఈమాట పత్రికవారి స్థాయికి తగిన రచనను నేను పంపలేకపోయాను! " అని.)

14, నవంబర్ 2016, సోమవారం

హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో


హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో
మరి మా కీర్తనల మాట యట్లుండ

కులకులలాడుచు కొత్తకొత్త మతములు
మొలకెత్త దొడగె నలుగడల
తెలిసితెలియని వారు తెలివైన వారును
బిలబిలలాడుచు వెడలుచుండు నెడ
హరి

పరదేశసంస్కృతుల భావనలను చదివి
పరవశించినిరతము పాడుచును
భరతసంస్కృతి నెన్ని పడతిట్టు వారు
తరచు నీ చరితల తప్పెన్నెడు నెడ
హరి

శ్రీరామ యనుటకే సిగ్గౌను పదిమంది
చేరియున్న చోటని న్నేరైనా
నోరున్నదని రెచ్చి పేరుకొని తిట్టేరో
ఘోరపాపము నన్ను కూడుకొనెడు నెడ
హరి



రామునకు మ్రొక్క మీ కేమి కష్టము


రామునకు మ్రొక్క మీ కేమి కష్టము శ్రీ
రాముడు కాక వేఱు రక్షకు డున్నాడా

శివదేవు డొక్కనికే చేరి మ్రొక్కెదరొ మీరు
చివరకు కాశీపురి చేరదలతురో
శివసన్నిధి విడుతురో జీవరత్నములు మీరు
శివుడే మీ చెవిలోన చెప్పు రామమంత్రము
రామునకు

శివకేశవు లిద్దరును చిల్లరదేవుళ్ళని చెప్పి
అవలంబించేరో యన్యధర్మములు
చివరకు మీరెచ్చట చేరెదరో తెలియరాదు
భువి మతములు పుట్టునట్లు పుట్టరు దేవుళ్ళు
రామునకు

ముక్కోటి దేవతలకు మూలపురుషుడైన హరి
అక్కజముగ వచ్చినా డందరి కొఱకు
చక్కగ లోనెఱిగి మీరు సరగున సేవింతురా
నిక్కువముగ శ్రీరాముని నిజధామము చేరుదురు
రామునకు



13, నవంబర్ 2016, ఆదివారం

కమలదళేక్షణ భళీభళీ


కమలదళేక్షణ భళీభళీ కమలానాయక భళీభళీ
కమలోదరహరి భళీభళీ కమలవదనహరి భళీభళీ

విమలచరిత్ర సుందరగాత్ర సుమధురవరద భళీభళీ
అమితవిక్రమ అసురనిగ్రహ అమరనాథనుత భళీభళీ
కుమతినివారక సుజనసుపోషక కువలయరక్షక భళీభళీ
కమలాసేవిత మునిజనభావిత కమలజసేవిత భళీభళీ
కమల

దశావతార త్రిలోకపాలక దైన్యనివారక భళీభళీ
ప్రశాంతవదన పరిపంధిజనప్రశాంతిభంజన భళీభళీ
విశేషఫలద విమోహనాశక విజ్ఞానప్రద భళీభళీ
దశాస్యముఖ్యనిశాచరాధిపదంభవిదళన భళీభళీ
కమల

పరమయోగిజనభావితచరణా పరమాత్మా హరి భళీభళీ
పరమదయాపర నిరుపమశుభగుణవారాన్నిధి హరి భళీభళీ
ధరణీతనయావర సురహితకర దశరథనందన భళీభళీ
నరనాయక హరి మోక్షదాయక నను నడిపింతువు భళీభళీ
కమల



9, నవంబర్ 2016, బుధవారం

హరినామ జపమున


హరినామజపమున నగుగాక శుభమని
పరికించి రాముని భజియించు ఘనుడు

భవదోషముల నెల్ల పడద్రోయ హరినామ
మవలంబనం బనుచు నాత్మలో దలచి
భువి నందరను గాచి ముక్తినిచ్చెడు దాని
నవిరళంబుగ జేయు నతడెపో ఘనుడు
హరి

ధవళాయతాక్షుడు ధర్మావతారుడు
వవనాత్మజాసేవ్యపాదరాజీవుడు
రవికులోత్తముడు శ్రీరాముడే హరియని
యెవడు సేవించునో యెంచవాడే ఘనుడు
హరి

రాతి నచ్చెరువుగను నాతిగా జేసిన
కోతికే బ్రహ్మగా గొప్ప నందించిన
ప్రీతితో విభీషణు విభునిగా జేసిన
సీతామనోహరుని చేరువాడే ఘనుడు
హరి



8, నవంబర్ 2016, మంగళవారం

అన్నిటికి నీవు నాకున్నావు


అన్నిటికిని నీవు నాకున్నావు లెమ్మని
యున్నాను నిను నమ్ముకున్నాను

అనుభవమ్మును జూచి యాదరించని వారు
వెనుక నా దొసగుల వెదకెడు వారు
అనువెఱిగి యధికుల మని యాడు వారు
కనబడుచున్నట్టి కాని కాల మిదియని
అన్నిటికి

ఈ వయస్సున గూడ నేవోవిలాసాల
భావించమని చెప్పువారి యొత్తిడుల
నే విధంబుగ ద్రోసి నీవలన నుందునో
యావంతయును బుద్ధికందక యున్న
అన్నిటికి

ప్రేమమీఱగ నీదు నామచింతనమె
నామత మగు గాక నా జీవితమును
నామార్గమున నడుప నా వలన కాక
రాముడా యిక నీవె రక్షించ మనుచు
అన్నిటికి



భక్తుని కష్టము భగవంతునిదే


భక్తుని కష్టము భగవంతునిదే
శక్తుడ వో రామ సాయపడ

మును కరిరాజు శక్తి మొదలంట సమసిన
తన వల్లకాదని దయ పుట్ట
నిను వేడుకొన రయమున వచ్చి మొసలిని
దునుమిన నీ‌కీర్తి తోరంబాయెను
భక్తుని

భక్తాంబరీషద్రౌపద్యాదుల కన
త్యక్తుడైన యరిసోదరునకన
వ్యక్తపఱచితి దయ యశమును గొంటివి
యుక్తి కలవాడు నీ‌భక్తుం డగును
భక్తుని

ఈదరాని జలనిధి యీసంసారము
నీదియీది యిక బలమేది నిను
చేదుకొమ్మని వేడు జీవుడ నన్నును
నాదరించవె నీయశమే పెరుగ
భక్తుని



7, నవంబర్ 2016, సోమవారం

రాముని దాసుడవా మంచిది


రాముని దాసుడవా మంచిది యిక
ఆమడదూరం బరుగు కలి

భగవద్భక్తుల వంకకు పోవుట
తగదని భయపడు తంపులమారి
నిగమవేద్యుడగు జగదీశ్వరుని
పొగడువారల పొడగని పరుగిడు
రాముని

నీమ మొప్పగా నిరతము నీవు
రామమంత్రపారాయణము
ప్రేమమీఱగా వెలయించితివా
నీముందిక కలి నిలబడునా
రాముని

శ్రీరఘురాముని స్థిరనివాసమున
కోరి గుండెను గుడిగా చెసిన
ధీరుడవైతే తెలివితక్కువగ
చేరబోడు కలి చిక్కులు పెట్టగ
రాముని



నమ్ముడిది నమ్ముడిది


నమ్ముడిది నమ్ముడిది నరులార మీరు
నెమ్మనముల రామునే నిలుపుడు

శ్రీరామచంద్రుడు చేసినయాజ్ఞ
ఆరు నూఱైన జరిగి తీరెడు నాజ్ఞ
వారాన్నిధికైన దాట వశమే కాదు
నారాయణాజ్ఞ రామనారాయణాజ్ఞ
నమ్ముడిది

శ్రీరామచంద్రుని చేతి బాణము
ఆరు నూఱైన తగిలి తీరెడు శరము
ఘోరపాపుల నది కూల్చితీరును
ధారుణిపై నెలకొల్పు ధర్మమార్గము
నమ్ముడిది

శ్రీరాముని శరణమని చేరిన జీవి
ఆరు నూఱైన శుభము లంది తీరును
కోరినచో మోక్షమైన గొంకు లేకయ
శ్రీరాముడిచ్చు నింక చింత వీడుడు
నమ్ముడిది



హరికృపయే మహదైశ్వర్యము


హరికృపయే మహదైశ్వర్యము
హరిస్మరణమె బ్రహ్మానందము

హరియనురాగమె యతిసంతోషము
హరిప్రసాదమతిపావనము
హరితో చెలిమియె యతివైభోగము
హరి తనవాడగు నరుడే ధన్యుడు
హరి

హరినామామృత మమితమధురము
హరిచరితమత్యధ్భుతము
హరిగుణగానమె తరుణోపాయము
హరి భక్తుడగు నరుడే ధన్యుడు
హరి

హరివిభూతియే యఖిలవిశ్వమును
హరికన్యము లేదనగ
హరియంశలె జీవాళి నందరును
హరియే రాముం డనుచు తెలియుము
హరి


శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని


శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని
శౌరి నీకే భజన సలిపెదము

పాడురాకాసుల పట్టిపల్లార్చగ
వేడుకతో నిల వెలసితివి
వాడిబాణముల వాదరచక్రపు
పోడిమి చెడుగుల పొగరణచినది
శ్రీ

సారపుధర్మము సత్యవివేకము
ధారుణి శుభసంధాయకమౌ
చారిత్రంబుల జనులకు చక్కగ
నేరిపి బ్రతుకులు నిలబెట్టితివి
శ్రీ

మనసునిలిపి నిను మానక కొలిచిన
మనుజుని పొందదు మాయయని
తనలో నెఱిగిన ధన్యాత్ములకు
కొనుడని మోక్షము కొసరెద వీవని
శ్రీ


6, నవంబర్ 2016, ఆదివారం

ఇత్తువని పునరావృత్తిరహితపదమును


ఇత్తువని పునరావృత్తిరహితపదమును
చిత్తమున నమ్మితి శ్రీరామచంద్ర

కొత్తకొత్త జన్మములు కొత్తకొత్త బంధములు
కొత్తకొత్త దుఃఖములు కోరుదునా
యెత్తినవే చాలునింక యేలుకోవయ్య నా
బత్తినెఱిగి రక్షించ ప్రార్థింతు నిన్ను
ఇత్తువని

అందని గౌరవముల కలమటింపులు చాలు
పొందినభోగముల పొలుపులు చాలు
చెందితి నిదె నీదు శ్రీపాదములకు చే
యందించి నను బ్రోవ మనుచు ప్రార్థింతు
ఇత్తువని

కోరెడు వారలకు నీవు కొంగుబంగారమవు
ఈరేడులోకముల నేలుడు దొరవు
నారాముడవని నిన్ను నమ్ముకొన్నాడ నా
ప్రేమనెఱిగి బ్రోవుమని వేమరు ప్రార్థింతు
ఇత్తువని


బంతులాట లాడె నమ్మ


బంతులాట లాడె నమ్మ భగవంతుడు బల
వంతులైన రిపుల తలపండ్లతోడ వేడుకగ

పదునాల్గువేల మంది పైకొన వచ్చిన
నదలించి వారి తలలన్నియు నెగిరించె
గదిసిన దూషణుని ఖరుని శిరములు
విదితాస్త్రుడంత నెగురవేసెను కినిసి
బంతులాట

అనిని రావణుని పట్టి యతనితల నెగుర గొట్టె
కనుగొన శిరమొండు క్రమ్మర తోచిన
నినకులపతి దాని నెగిరించె వేగమె
కొనసాగ నీయాట గుట్టలాయె తలలు
బంతులాట

ఆడియాడి రావణు నపుడు జంపెను కాని
వేడుక తీరెనా వీరరాఘవునవు కన్న
వాడు శిశుపాలుడై వచ్చునట్లుగ జేసి
కోడెగించు వాని తల కొట్టి ముగించెను
బంతులాట


కొలుచుకొన నిమ్మని కోరినంతనె


కొలుచుకొన నిమ్మని కోరినంతనె నీవు
కొలువిచ్చినావు నీవు కోదండ రామ

నలినాయతాక్షి లచ్చి నాథుడవగు నిన్ను
కొలువగ సీతగా కుదురుకొన్నది
వెలసె శేషాహి నిన్ను వెంటనంటి కొలువ
తులలేని తమ్ము డీయిలను లక్ష్మణుడన
కొలుచు

కొలుచుకొనగ గాలికొడుకు దేవుడవని
పిలచి బ్రహ్మపదము కొలిచితివి
కొలువున జేరగ కోర విభీషణు
నలవోకగ నసురరాజ్యాధిపు జేసితివి
కొలుచు

కొలిచిన వారికి కోరిన దిచ్చెద వని
తెలిసి చేరితినని తెలియుదువు
కొలిచెడు వారికి కొంగుబంగారమవు
కలకాలము నన్ను నీకడ నుండనిమ్ము
కొలుచు


5, నవంబర్ 2016, శనివారం

హరి యనవే హరి యనవే


హరి యనవే హరి యనవే
హరికృప చాలని యనవే యనవే

సకలదేవగణ సకలమౌనిగణ
నికరము తనయెడ నిరుపమభక్తిని
ప్రకటించగ శ్రీరాముడైన హరి
యొకడే చాలని మనసా
హరి

హరిని రాముడని యరసి వేడుకను
పరమభక్తి గొని పరిపరి విధముల
నిరుపమానశుభనిశ్చయ గరిమను
విరిసి కొలుచుచు మనసా
హరి

శరణు వేడితే కరుణ బ్రోచు నని
సురనరవిహగాసురవర్గములు
కరము పొగడు నా ఘనుని రాముని
హరియని తెలిసిన మనసా
హరి


4, నవంబర్ 2016, శుక్రవారం

రామవిద్య యొక్కటే రమ్యవిద్య


రామవిద్య యొక్కటే రమ్యవిద్య
క్షేమము చేకూర్చు విద్య రామవిద్య

పామరత్వము విడక బహుశ్రద్ధతో
తామసికములైన తదితరములైన
ఏమోమో విద్యలు మీ రెంత నేర్చినా
రామవిద్యలేని యెఱుక రక్తికట్టదు
రామవిద్య

వేదవేదాంగ శాస్త్రవిద్య లెఱిగినా
వాదవివాదముల గెలిచి వన్నెకెక్కినా
వేదాంతుల శుశ్రూషలు విడక చేసినా
లేదు ముక్తి రామవిద్య లేని వానికి
రామవిద్య

రామవిద్య నేర్వ మరల రాడు పృధివికి
రామవిద్య నేర్వ పోవు రాముని దరికి
రామవిద్య నేర్చుటకు రక్తి కలిగెనా
రామకృపయె నేర్పునండి రామవిద్య
రామవిద్య


ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు


ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
చతురులై కొలిచి ముక్తి సాధించుడు

జ్ఞానస్వరూపుడు జ్ఞానప్రదాయకుడు
దేనిపైన రాగమును పూననివాడు
తానె జగదీశ్వరుడై తనరెడువాడు
మానిత సత్కీర్తిపరుడు మారాముడు
ఇతడే

దానవారి ధర్మసంస్థాపనాచార్యుడు
పూని యార్తుల నెల్ల ప్రోచువాడు
మానవోత్తముడు సర్వమంగళవిక్రముడు
జానకీవిభుడు భువనసంరక్షకుడు
ఇతడే

సిరులకు నెలవితడు శ్రీనివాసుడు
సిరులుపంచు శ్రీనిథి చిన్మయమూర్తి
సిరులకు సిరియైన మోక్షశ్రీ నిచ్చువాడు
పరమాత్ముడు రాముడు భగవంతుడు
ఇతడే


హరిలేడు లేడని యను వానితో


హరిలేడు లేడని యను వానితో
హరిభక్తుడు వాదించ నవుసరమేమి

హరిని గూర్చి యవలివాని కరచి చెప్పినా
హరితత్త్వము వానిబుద్ధి కవగతమగునా
పరమభక్తుడగువాడు బడయు జ్ఞానము
పరమశుంఠ బుద్ధి నెట్లు భాసించేను
హరి

బహుజన్మల సంస్కార ఫలితము వలన
అహరహమును హరిస్మరణానందము కలుగు
విహితుడైన హరిని దలచు వేళల యందు
అహితులతో వాగ్వాదము లాడకు మీవు
హరి

శ్రీరాముడు దైవమని చెప్పుదు వీవు
శ్రీరాముని వాడు నింద చేసి నవ్వును
ధారుణి బహుజన్మ లెత్తి తానె తెలియును
శ్రీరాముడు వాని నపుడు చేరదీయును
హరి


అన్నిటి కంటెను ముఖ్యమైనది


అన్నిటి కంటెను ముఖ్యమైనది హరిసాన్నిధ్యమురా
చిన్నాచితక సిరులకు భ్రమసిన చిక్కులు తప్పవురా

ఇంతకు ముందుగ నెన్నిమారులో యిలపై పుట్టితివే
అంతోయింతో యార్జించితివే యన్నిభవంబులలో
అంతగ శ్రమపడి కూడబెట్టినవి యాయాజన్మలతో
అంతరించెగా ననుసరించి రాదాయె నేదియైన
అన్నిటి

చింతాకంతయు మాధవచింతన చేయకుండు మదిలో
చింతలు కాపురముండును సుఖము చేరగ రాకుండు
పంతగించి సిరులందు భ్రమలను వదలగొట్టుకొనక
ఎంతవగచిన ఫలములేదురా ఎన్నే జన్మలకు
అన్నిటి

రామరామయని రామనామమును ప్రేమమీఱ పలికి
రామచంద్రపదరాజీవంబుల రక్తిమీఱ గొలిచి
రాము డిచ్చునది చాలు నన్యములు రాలురప్పలనుచు
నీ మదిలో ధృఢనిశ్చయముండిన నీవు తరింతువురా
అన్నిటి


3, నవంబర్ 2016, గురువారం

నే నడిగినదేమి


నే నడిగినదేమి నీ విచ్చినదేమి
మానుము నటనలు మాధవా

తెలియని వాడనో తెలిసిన వాడనో
తెలిసిన వాడవు దేవా
వలచిన మోక్షము కొలువుము మానుము
కులుకుచు నవ్వుట కూడదయా
నే‌ నడిగిన

నిరతము నటునిటు నింగికి నేలకు
తిరుగగ లేనని దేవా
హరి శ్రీరామ మోక్ష మడిగిన నీయక
మరిమరి త్రిప్పుట మరియాదా
నే నడిగిన

తప్పులు సురలను తగులుచు లేవే
దెప్పగ వచ్చిన దేవా
చప్పున తిరుగుడు చాలనక నా
తప్పులు వెదకుట తగదయ్యా
నే నడిగిన


నాభక్తి నిజమా నాప్రేమ నిజమా


నాభక్తి నిజమా నాప్రేమ నిజమా
యేభయమో నడిపించు నటనయా

రామా నీపై రక్తియున్నదే యది
ప్రేముడియా లేక నావెఱ్ఱియా
నామతమున నీవు నాసర్వస్వము
నీమత మేమయ్య నీకెవ్వడను
నాభక్తి

రామయ్య తలచు నీ నామము కన
యేమియు నాశించ దా మనసు
ఆ మాయకలిభయ మన్నది కతమా
నీ మీద ప్రేముడియే నిక్కువమా
నాభక్తి

సామాన్యుల యందు సామాన్యుడ రామ
నా మార్గము నీకు నచ్చినదా
యేమందు విది భక్తి యే యందువా
యేమి నీపై భయమే యందువా
నాభక్తి


నాగులచవితికి నాగేంద్రా ... బసవరాజు అప్పారావుగారి గీతం



మంచి భావకవి బసవరాజు అప్పారావు గారి నాగులచవితికి నాగేంద్రా నీ పుట్టలోపాలు పోసేము తండ్రీ అన్న గీతాన్ని కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.

మనోరంజకమైన పాటను చూచి, విని ఆనందించండి.
 
ఆసక్తి కలవారు అప్పారావు గారి గీతాలను ఆంద్రభారతిలో చదువుకొని ఆనందించవచ్చును.

1, నవంబర్ 2016, మంగళవారం

నేను నీవను సంజ్ఞలు


నేను నీవను సంజ్ఞ లేటికి కలిగెనో
వాని వెంబడి చాల వచ్చినవి

మొదట భేదము పుట్టె నది పుట్టకుండునా
సదయ యొండొంటికి సరిపోల్చ
యిదియని యదియని యుదయించ కున్నచో
నదినీవు యిదినేను నాగ నేముండు
నేను

పిదప దూరము పుట్టె నది పుట్టకున్నచో
వదలక రెండును కుదురుగను
గదిసి యుండును కాదె ముదముగ నొకటైన
నదినేను నిదినీవు నన నేమి కలదు
నేను

తుదిని కాలము పుట్టె నది పుట్టకున్నచో
కదలిక యననేది కలదయ్య
కదలక మెదలక ఘనుడా రామయ్య
పదిలంబుగ నొక తత్త్వంబుగ నుందుము
నేను


నా మనసేలే రామచంద్రునకు


నా మనసేలే రామచంద్రునకు
దామోదరునకు దండములు

నిర్మోహునకు నిగమవేద్యునకు
కర్మదూరునకు కమలాక్షునకు
నిర్మలమూర్తికి నిత్యాశ్రయునకు
ధర్మాకృతికివె దండములు
నా మనసేలే

పరమపురుషునకు పతితపావనా
పరమవ్రతునకు పరమాత్మునకు
నిరుపమానునకు నిర్మలసురుచిర
దరహాసున కివె దండములు
నా మనసేలే

వినయముతో కడు వేడుకతో
దనుజవిదారికి దండములు
మనుజాధిపునకు మనసా శిరసా
తనివితీరగా దండములు
నా మనసేలే