17, మార్చి 2018, శనివారం

ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక



ఉ. రాముని పైన పద్యములు వ్రాయుట కంటెను భాగ్యమున్నదే
యామని వేళ పద్యముల నల్లుట కంటెను భాగ్యమున్నదే
యేమని చెప్పవచ్చు హృదయేశ్వరు డైన మహాత్ముడా పరం
ధాముని పైన పద్యము లుదారత నామని జెప్పు భాగ్యమున్
తే.గీ. చైత్రశుధ్ధపాడ్యమి నాడు చిన్మయుండు
భూమిజాయుక్తు డైనట్టి రామచంద్ర
మూర్తి పట్టాభిషిక్తుడై పుడమి నేలె
పరమధర్మావతారుడా భద్రమూర్తి
సీ.  శ్రీరామపట్టాభిషేకమహోత్సవ
    పర్వదిన ముగాది పర్వదినము
ప్రభువాయె నుగాది భద్రదినంబున
    ధర్మాత్ముడైనట్టి ధర్మరాజు
విఖ్యాతికెక్కిన విక్రామాదిత్యుడు
    గద్దె కెక్కిన దుగాది ఘనదినంబె
పట్టాభిషిక్తుడై ప్రభువాయె నుగాది
    దినమున శాతవాహనుడు గూడ
తే.గీసర్వవిధముల సకలరాజన్యసేవ్య
మానమై నవ్యవాసంతమహితశోభ
నెల్లవారల హృదయమ్ము లుల్లసిల్ల
నరుగుదెంచె విలంబి యుగాది యిపుడు
తే. రామచంద్రుని సత్కృపాప్రాప్తి గలిగి
సకలసౌఖ్యములను గూర్చజాలు గాక
ఈ విలంబి యనెడు పేర నెసగు నట్టి
కొత్తసంవత్సరము మన చిత్తములకు
తే. రాము డేలెడి భూమిలో రాజకీయ
పక్షులాడెడి యాటలు పాడుగాను
ఆంధ్రజనులకు సంతోష మతిశయించ
ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక

( చందానగర్ లో జరిగిన నేటి కవిసమ్మేళనంలో ఈపద్యాలను చదవటం జరిగింది.)