11, ఆగస్టు 2017, శుక్రవారం

నీవే నేనుగ నేనే నీవుగ



నీవే నేనుగ నేనే నీవుగ
భావించిన శుభపక్షంబున నిక

బంధము కలదా బాధలు కలవా
సంధించగ ప్రశ్నావళి కలదా
గ్రంథము కలదా గాథలు కలవా
అంధలోక మే మనునో యననీ

లోకము కలదా శోకము కలదా
చీకటి కలదా వేకువ కలదా
యేకత్వము గా కితరము కలదా
ఈ‌ కాలం‌ బిక లేక పోవు కద

నేనుండెదనా నీవుండెదవా
ఈ‌ నేనును నీ వేమి పదములు
తానై నిండిన తత్త్వం బొకటే
జ్ఞానత్రిపుటియు లేనే లేదు



4 వ్యాఖ్యలు:

  1. బంధము కలదా బాధలు కలవా
    సంధించగ ప్రశ్నావళి కలదా..చక్కని పదాల్లిక

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. శ్యామలీయం బ్లాగుకు స్వాగతం.
      మీకు నచ్చినందుకు సంతోషం. అది వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించు
  2. మీ ఈ కవిత చదివి నేనూ ప్రయత్నించాను - ఒక చిన్న కవిత :)

    నేనే ఇహమని నీవే పరమని
    ఎఱుకైనది తలపునిక
    నీదే భారమని నాదే వరమని
    ఏమందును నా భాగ్యమిక

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. బాగుంది బాగుంది. [ ఒక చిన్న సవరణ, 'ఎఱుకైనది నా తలపున నిక అనండి' మరికొంచెం తూగుకోసం. ]

      తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.