19, జూన్ 2017, సోమవారం

నేను -4

ఎందుల కిటు లైనాను
మందుడ నైతిని నేను

కలలా యిది యిలలోని కథయా
యిలయా మరి కలవంటి వ్యథయా
తెలియకుండుచో నిలచే దెట్లా
కలియక యే నిను తెలిసే దెట్లా

పొటమరించగా అహంకారమే
ఇటు వచ్చితినో‌ పొరబడి నేనే
యిటు వచ్చాకే పొరబడి నానో
ఇటునటు పరుగులు మానగ లేనో

తొల్లిటి తెలివిడి దూరం బగుటకు
కల్లప్రపంచమె తగు కారణమా
గుల్లగురుగులీ‌ కల్లయుపాధుల
పెల్లగించుకొను విధమే లేదా

18, జూన్ 2017, ఆదివారం

నేను - 3

దూరతీరా లేవో నన్ను చేర రమ్మని పిలిచేను
కోరిపిలిచే గొంతులన్నీ కొంటెవాడా నీవేను

ఏతీరమైనా యొకటేలే యీ యీతరాని జీవునకు
చేతోముదము నీకౌనుగా నే చేరుచో నొక తీరము
ఏతీరున భవవార్నిధిని తా నీదురా యీ జీవుడు
నాతోడువై నిర్వ్యాజకృపతో నన్నుచేర్చును తీరము

నేరక నిన్ను విడచితి నయ్యో నేనొక జీవుడ నైతిని
ఘోరమహాభవసాగరజలముల క్రుంగక నన్నీదించుము
తీరము జేర్చే భారమునీదే తిరముగ నిన్ను నమ్మితిని
నేరుపుమీరగ నను రక్షింపుము నిన్నిక విడువను విడువను

నన్ను నీవు పిలచుచుంటివి నాకై వగచుచు నుంటివి
నిన్ను నేను పిలచుచుంటిని నీకై వగచుచు నుంటిని
చన్న వెన్నో యుగము లిటులే సాగిరారా నాకొఱకై
వన్నె కాడా నా చేనంది  తిన్నగా దరి చేర్చరా15, జూన్ 2017, గురువారం

నేను - 2రవివి కావు నీవు
కవిని కాను నేను

రవి జీవితము ఒక దినము
కవి జీవితము ఒక యుగము
రవివలె నీవు దినార్ధకాలపు రాజువు కానే కావు
కవివలె నేను కాలపుపోటుకు కదలని వాడను కాను

రవి వెలుగు పంచి కదలు
కవి పలుకు పంచి కదలు
రవితేజము నీ వధిగమించినను రవి వలె తపనుడవా
కవి నెట్లౌదును జ్ఞానపుంజముల కలిమి లేని నేను

రవి చూడ లోకబాంధవుడు
కవి  కూడ లోకబాంధవుడు
రవివలె అందరి వాడవు కాని నిరంజనుడవు నీవు 
కవివలె రవియును కాంచని యూహల కలిమి లేదు నాకు14, జూన్ 2017, బుధవారం

నేను


నేను నీతో పందెంవెసి నిన్నో మొన్నో ఓడానా
ఐనా నీతో పందెం కాస్తే నేనే కాయా లన్నానా

దాగుడుమూతల చెలికాడా నీదైన తీరున దాగున్నా
నీ గుట్టుమట్లను కాలం దాచి నిశ్శబ్దంగా ఉంటున్నా
వేగం చాలని నా ఊహలు నిను వెదుకలేక విరమిస్తున్నా
అగక ఆశాజ్యోతి నందుకొని అహరహమూ యత్నిస్తున్నా

ఓడిన కొద్దీ నీతో‌ పందెం హుషారు కలిగిస్తున్నదిరా
ఆడిన కొద్దీ‌ నీతో‌ ఆటలు ఆనందాలను పంచునురా
వేడిన దొరకని వాడవు నిన్నే ఓడింతును బంధింతునురా
గూడు కట్టి నా గుండెలోపలే గుట్టుగ దాచుకొందునురా

మాయగాడివని పేరుబడ్డ నీమాయ రహస్యం కనుగొన్నా
సాయం కోరను కాలాన్ని నే సాయం కోరను విశ్వాన్ని
ధ్యేయం సిధ్దించేందుకు మంచి ఉపాయం నేను కనుగొన్నా
ఓయీ యీ నా ప్రేమపాశమున ఒడిసిపట్టనా విజయాన్ని

23, మే 2017, మంగళవారం

మధురగతి శివరగడసృష్టి సమస్తము శివాజ్ఞచే నగు
సృష్టి వికాసము శివాజ్ఞచే నగు
సృష్టి విలాసము శివాజ్ఞచే నగు
సృష్టిని సర్వము శివాజ్ఞచే నగు
సృష్టికి తుష్టియు శివాజ్ఞచే నగు
సృష్టి లయంబును శివాజ్ఞచే నగు
జీవుని రాకడ శివాజ్ఞచే నగు
జీవుని పోకడ శివాజ్ఞచే నగు
జీవుని యునికియు శివాజ్ఞచే నగు
జీవుని మనికియు శివాజ్ఞచే నగు
జీవుని యోగ్యత శివాజ్ఞచే నగు
జీవుని భాగ్యము శివాజ్ఞచే నగు
జీవుని భోగము శివాజ్ఞచే నగు
జీవుని యోగము శివాజ్ఞచే నగు
జీవుని విభవము శివాజ్ఞచే నగు
జీవున కభయము శివాజ్ఞచే నగు
జీవికి తెలివిడి శివాజ్ఞచే నగు
జీవికి మోక్షము శివాజ్ఞచే నగు
జీవికి ధర్మము శివాజ్ఞయే యగు
జీవికి సత్యము శివాజ్ఞయే యగు
జీవన ధర్మము శివాజ్ఞచే నగు
జీవికి శుభములు శివాజ్ఞచే నగు
ఏవిధముగ నవి యెసగునొ తెలియుము
భావన చేయుము బంధము విడువుము
శివకైంకర్యము చేసిన శుభమగు
శివమాహాత్మ్యము చెప్పిన శుభమగు
శివపూజనముల చెలగిన శుభమగు
శివనామంబును చేసిన శుభమగు
శివశివశివ యని శివచిహ్నంబగు
ధవళవిభూతిని దాల్చిన శుభమగు
శివశివశివ యను శివసేవకులగు
శివమూర్తులతో చేరిన శుభమగు
అవిరళశివతీర్థాటన పరుడగు
శివభక్తున కతి శీఘ్రమ శుభమగు
అనారతంబును హరుని నామము
రసనాగ్రంబున రాజిలు నీమము
కలిగి రహించిన కడుగడు శుభమగు
కలుషవనంబుల గాల్చెడి  శుభమగు
శివశివ శివశివ శివశివ యనుచును
భవభవ భవభవ భవభవ యనుచును
హరహర హరహర హరహర యనుచును
స్మరహర స్మరహర శరణం బనుచును
శరణము పురహర శరణం బనుచును
శరణము భవహర శరణం‌ బనుచును
శరణము పశుపతి శరణం‌ బనుచును
శరణము త్ర్యంబక శరణం‌ బనుచును
శరణ ముమాపతి శరణం‌ బనుచును
శరణము ధూర్జటి శరణం బనుచును
పరమానందము బడసిన శుభమగు
పరమశుభంబగు పరమశుభంబగు
పరమశుభంబగు పరమపదంబున
హరుడు నిలుప నత్యంత ముదంబున
అటునిటు దిరిగిన  నటమట కలుగును
ఇటులుండినచో హితమే కలుగును
శివునే తలచుము శివునే కోరుము
శివునే నమ్ముము శివునే చేరుము

(రేపు 24న మాసశివరాత్రి సందర్భంగా శివపరంగా మధురగతి రగడ)

25, ఏప్రిల్ 2017, మంగళవారం

శివస్తుతి దండకం.


పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు శంకరాభరణం బ్లాగులో 2013-03-10 నాడు మహాశివరాత్రి సందర్భంగా ప్రకటించిన శివస్తుతి దండకం.

శంభో మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా! సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా! చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానించెదన్.

సహస్రార్కకోటి ప్రభా భాసురంబై యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై మహానందధామంబునై జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో దేవ!దేవా! అచింత్యప్రభావా!

సురల్ రాక్షసుల్ గూడి క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా! త్రిలోకైక రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా!

ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై, భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై, దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో! నమస్తే నమస్తే నమః


29, మార్చి 2017, బుధవారం

ఉగాది


అరువది యైదు వచ్చిన వుగాదులు నే జనియించి నేటికిన్
వరుసగ వచ్చిపోయినవి వన్నెలపూల వసంతకాలముల్
చురచుర మండు నెండలును క్షోణితలంబును ముంచువానలున్
పరమమనోహరంబులన వచ్చు శరత్తులునుం సమస్తమున్

పరువము వచ్చి పోయెనది వచ్చుటయే గమనించనైతి నా
గరువము వచ్చి పోయెనది కాలప్రవాహము కొంచుపోవగన్
మరణము పల్కరించినది మానక మాటికి నీశ్వరాజ్ఞచే
మరలక దేహమందు తిరమైనవిధంబున నుంటి నేడిటుల్

వచ్చె వసంతకాలమని పండువ చేయగ నెల్లవారలున్
మెచ్చి కవీంద్రులందరును మేలిమికైతల గుప్పుచుండగన్
ముచ్చటగా నుగాది మన ముందుకు వచ్చెను కాని నేటికే
హెచ్చిన యెండవేడిమికి యెందును కోయిల కూతలుండెనే

ఐనను సంప్రదాయమని యందరు చేయు వసంతగానముల్
వీనుల విందుగా వినుచు వేడుక చేయుచు క్రొత్త యేట రా
నైన శుభాశుభాదికము లాత్రుతమీఱ విమర్శ చేయుచున్
నేనును హేమలంబికి ననేక ప్రణామము లాచరించెదన్
  

26, మార్చి 2017, ఆదివారం

అకారాద్యక్షరమాలా శివస్తోత్రమ్


అత్యంతసుఖసంతోషప్రదాయ పరమాత్మనే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఆత్మరూపాయ వృధ్ధాయ అనుగ్రహపరాయతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఇనచంద్రాగ్నినేత్రాయ ఈశ్వరాయ నమోస్తుతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఈశానాయచ విఘ్నేశగురవే గురురూపిణే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఉమానాథాయ శర్వాయ లోకనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఊర్థ్వలింగాయ పూజ్యాయ దివ్యలింగాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఋగాదివేద వేద్యాయ దుఃఖనాశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఏకానేకస్వరూపాయ  శోకాదివర్జితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఐశ్వర్యదాయ విశ్వాయ విశ్వసంపూజితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఓంకార వాచ్యరూపాయ మహాదేవాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఔక్థికప్రీతచిత్తాయ మహారూపాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

కాలాయ కాలకాలాయ కాలకంఠాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఖగరాడ్వాహసంపూజ్యమానదివ్యాంఘ్రియుగ్మతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

గజచర్మాంబరాఛ్ఛాధ్యసుశ్వేతవపుషే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఘోరశ్మశానవాసాయ గతాతతాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానరూపాయ శాంతాయ ధ్యానగమ్యాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

చంద్రచూడాయ నిత్యాయ లోకప్రియాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఛందోనువాకస్సంస్త్యుస్త్య నిజప్రభావతే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జన్మమృత్యుజరాబాధానివారకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఝుంకారభ్రామరీయుక్త శ్రీశైలాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానగమ్యాయ యజ్ఞాయ వ్యాళరూపాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

టంకటీకాయ త్వష్టాయ త్రికంటకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఠంకారమేరుకోదండయుక్తహస్తాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

డమరుకసృష్టవాక్ఛాస్త్రమూలసూత్రాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఢంకాతూర్యాదికస్సర్వవాద్యప్రియాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నిస్తులాయ ప్రసన్నాయ గిరిధన్వాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

తత్త్వమసీతివాక్యార్థ లక్ష్యరూపాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

స్థాణవే సర్వసేవ్యాయ జంగమాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

దుఃఖనాశాయ సూక్ష్మాయ మహాకేశాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ధ్రువాయాభివాద్యాయ హరిణాక్షాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నృత్యప్రియాయ హైమాయ హరికేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

పంచవక్త్రాయ భర్గాయ పరమేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఫాలనేత్రాయముఖ్యాయ సర్వవాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

బలాయ శిపివిష్ఠాయ జటాధరాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

భవాయ భవనాశాయ భూతనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

మహాతపాయ సోమాయ వామదేవాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

యమగర్వాపహర్తాయ నిరవద్యాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

రుద్రాయ లోహితాక్షాయ బహురశ్మిశ్చ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లింగాద్యక్షాయ సర్వాయ మహాకర్మాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

విరూపాక్షాయ దక్షాయ వ్యోమకేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

శత్రుఘ్నాయ భవఘ్నాయ ధర్మఘ్నఘ్నాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

షడధ్వాతీతరూపాయ షడాశ్రయాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

సర్వవేదాంత సారాయ సద్యఃప్రసాదినే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

హరాయ లోకథాతాయ హరిప్రియాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లలాటాక్షాయ వైద్యాయ పరబ్రహ్మాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

క్షేమంకరాయ యోగీంద్రహృన్నివాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.23, మార్చి 2017, గురువారం

స్వయంప్రభ


వేణువు బ్లాగర్ వేణుగారు ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!  అనే అద్భుతమైన టపా వ్రాసారు. ఆ టపాకు నేను వ్రాసిన వ్యాఖ్యలో నేను స్వయంప్రభ అన్న నవల ప్రస్తావన తెచ్చాను. నేనూ ఆ స్వయంప్రభ నవల ఎక్కడన్నా దొరికితే బాగుండునని చూస్తున్నాను మరి. ఆనవల కథ నాకింకా గురుతు ఉన్నదనీ ఆవిషయమై ఒకటపా వ్రాస్తాననీ వేనుగారితో అన్నాను. ఇదిగో అటపా.
 
ఈ స్వయంప్రభ అన్న పేరే చాలా ఆకట్టుకుంది.  శ్రీమద్రామాయణంలో వానరులు సీతాన్వేషణం చేస్తూ పోయి, ఒక గుహలో ప్రవేశించి చూసి, అందులో చిక్కుపడి బయటికిపోయే దారితెలియక అందులోనే తిరుగుతూ, అక్కడ ఒకచోట తపస్సు చేసుకుంటున్న ఒకామెను చూస్తారు. ఆమె పేరు స్వయంప్రభ. అమె వారి కథ విని, వారికి బయటకు పోయే మార్గం చూపుతుంది.

స్వయంప్రభ అంటే స్వప్రకాశం‌ కలవ్యక్తి అని అర్థం వస్తుంది. అంటే తన వ్యక్తిత్వం ద్వారానే అందరినీ ప్రభావితం చేసే వ్యక్తి అన్నమాట. బాగుంది కదా?

ఈ నవల రచయిత పేరు అట్టమీద కె.సుబ్బయ్య అని ఉంది. ఈ విషయం ఇన్ని దశాభ్దాలు గడిచినా కచ్చితంగా గుర్తు ఉంది. ఈ సుబ్బయ్య గారి గురించిన వివరాలేవీ తెలియవు ఇప్పటికీ‌ నాకు.

"స్వయంప్రభ" నవలలో ప్రారంభవాక్యం. ఈ రోజు అమ్మ నన్ను బడికి వెళ్ళవద్దంది అని ఉందని బాగా గుర్తు. ఆతరువాతి వాక్యాల్లో మాప్లిమౌత్ కారు కూడా అమ్మేశారు. మేము మా పెద్ద బంగాళాలో నుండి ఊరి చివర ఒక చిన్న ఇంట్లోకి మారాం అంటూ స్వయంప్రభ స్వగతంతో నవల మొదటి పేరా మొదలు అవుతుంది.

నిజానికి ఈ‌ నవల అంతా స్వయంప్రభ అనే స్త్రీమూర్తి తనకథను మనకు చెబుతున్నట్లుగా నడుస్తుంది.

స్వయంప్రభ తండ్రి ఒక వ్యాపారస్థుడు. ఉండేది విజయవాడలో. ఆ పిల్ల రోజూ కారులో బడికి వెళ్ళేది ఆ రోజుల్లోనే. ఉన్నట్లుండి రోజులు మారాయి. తండ్రి వ్యాపారం దివాళా తీసింది. ఆస్తి అంతా పోయింది. కారూ బంగాళా అన్నీ‌ పోయాయి. చదువు మానేసింది. ఊరి చివర ఒక మురికివాడకు చేరింది ఆ అమ్మాయి కుటుంబం.  తండ్రి ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. తల్లి నాలుగిళ్ళలో పాచిపనికి వెళ్ళసాగింది.

తీరికసమయాల్లో  అక్కడి పాటకజనంలో ఉన్న దురలవాట్లను మానిపించటానికి స్వయంప్రభ తలిదండ్రులు కృషిచేస్తున్నారు.

తండ్రి గతించి, పరిస్థితులు ఇంకా దిగజారతాయి. ఒకసారి తల్లి కొద్దిగా జబ్బుపడటంతో చిన్నారి స్వయంప్రభ స్వయంగా తానే తల్లి పనిచేసే ఇండ్లకు వెళ్ళవలసి వస్తుంది.

పనిచేయటానికి వెళ్ళిన ఒకచోట ఒక నరరూపవిషసర్పం‌ కాటుకు గురియైంది స్వయంప్రభ. ఆ అమ్మాయి ఎలాగో పోరాడి తప్పించుకొని వచ్చింది. తనకేమీ కాలేదని ఆ అమ్మాయి భ్రమపడటాన్ని తప్పని ప్రకృతి ఎత్తి చూపింది.
చీత్కారానికి గురియై ఇంటి నీడకు దూరం ఐనది.

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ఒక దయామయి ఐన వైద్యురాలి సహాయం‌ లభిస్తుంది. తనకు పుట్టిన బిడ్డ నేలమీదపడిన వెంటనే గతించిందని తెలిసి నిర్వేదానికి గురి ఔతుంది స్వయంప్రభ. అస్పత్రిలో ఎక్కువరోజులు ఉంచుకోరు కదా. మరలా బజారున పడుతుంది ఆమె జీవితం.

ఎక్కడైనా పనిపాటలు చేసుకొని బ్రతుకుదామంటే లోకంలో గృహిణులు అందరూ ఆమె సౌందర్యాన్నీ వయస్సునూ చూసి బెజవాడ జాంపడులా ఉన్నావు నువ్వు పనిచేయటానికి వస్తావా? మా మగాళ్ళని బుట్టలో వేసుకుందుకు వస్తావా? వెళ్ళు వెళ్ళు అని కసిరి పంపేవారే.

చివరకు ఆమెకు ఒక రైల్వే టికెట్ కలెక్టర్ ఆదరణ లభిస్తుంది. ఒక రాత్రివేళ టికెట్ లేకుండా పట్టుబడి అనుకుంటాను. అతడి ఇంట్లో అశ్రయం అంటే - అక్కడ అతడి భార్యాపిల్లలు ఎవరూ లేకపోవటం చూసి విస్తుపోతుంది. అమెను ఇంటిలో దింపి డ్యూటీకి వెళ్ళిపోతాడతను. తను సౌజన్యంతో వర్తించినా, అమె అక్కడినుండి వెళ్ళిపోతుంది.

అనంతర కాలంలో ఆమె ఒక కారు ప్రమాదానికి గురై గాయపడుతుంది. కారు నడిపే వ్యక్తి ఒక ఆగర్భశ్రీమంతుడైన జమీందారు యువకుడు. త్రాగుబోతు. వ్యక్తిగతంగా మిగతా నడవడికలో మంచి బుధ్ధిమంతుడే. అతడు అమెను ఇంటికి తీసుకొనిపోయి వైద్యం చేయిస్తాడు. స్వయంప్రభ యొక్క సత్ర్పవర్తన అతడిలో అనూహ్యమైన మార్పు తెస్తుంది. దుర్వ్యసనాలు మాయం అవుతాయి. అతడికి స్వయంప్రభ అంటే గొప్ప ఆరాధనా భావం. ఆమెను అందరూ జమీందారిణిగా భావించేలా ఆమె స్థితిగతులు మారుతాయి. కాని ఇద్దరిమధ్యనా ఏవిధమైన సంబంధమూ ఏర్పడలేదు.

సంక్రాతికి జమీందారు స్వయంప్రభతో సహా  ఒక గ్రామానికి వెడతాడు. అక్కడి సంక్రాంతి సంబరాలను రచయిత అద్భుతంగా వర్ణిస్తాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో బంతిపూలపైన ఆయన వ్రాసిన అమోఘమైన పాట ఒకటి ఉంది.

స్వయంప్రభ తల్లినీ తోబుట్టువులనూ చూడటానికి వెడుతుంది. కాని తన కూతురు ఒక భ్రష్ట అన్న భావనలో ఉన్న తల్లి ఆమెతో మాటలాడేందుకు కూడా తిరస్కరిస్తుంది. తీవ్రవిచారంతో స్వయంప్రభ తిరిగి వెడుతుంది.

కథలో ఇంకొన్ని మలుపులు వస్తాయి.

ఆమెకు కొంత ఆత్మన్యూనత కలుగుతుంది. జమీందారుకు తనను వివాహం చేసుకొనే ఉద్దేశం ఉందని తెలిసి, తానతనికి తగనని భావించి దూరంగా తొలగిపోతుంది. అతడు తట్టుకోలేక మరలా త్రాగుడును ఆశ్రయిస్తాడు. స్వయంప్రభకు ఒకప్పుడు ఆశ్రయం ఇచ్చిన రైల్వే ఉద్యోగి మరలా తారసపడతాడు. భార్య మరణంతో అతడు జీవఛ్ఛవంలా ఉండటం చూసి ఆమె తల్లడిల్లుతుంది. అతడి సోదరిగా అతని వద్దే నిలిచి మరలా మనిషిని చేస్తుంది. ఇలా అనేక సంఘటనల్లో ఆమె వ్యక్తిత్వం ఇతరులకు సహాయపడటంలో ప్రస్ఫుటంగా భాసిస్తూ ఉంటుంది.

మరలా జమీందారు ఆమె జీవితంలోనికి వస్తాడు. కాని ఆమెకు అప్పటికే జీవితంపై ఏవిధమైన స్వకీయమైన కోరికలూ లేని స్థితి. నలుగురికీ సహాయపడాలనే అమె ఆరాటం. తనలాగే ఎందరో సంఘంలో విధివంచితలు. వారికి తానేమైనా చేయాలన్న ఆశయం ఒక్కటే ఆమెను నడిపిస్తుంది. అది ఆమెను ఎరిగిన వారికి ఆమోదం కలిగిస్తుంది.

స్వయంప్రభ చివరకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అభాగినులైన స్త్రీలకు ఆశ్రయం కల్పించి అసరా ఇస్తుంది.

ఇదీ క్లుప్తంగా స్వయంప్రభావృత్తాంతం. ఈ‌నవలను రచయిత చాలా సరళమైన భాషలో, భావోద్వేగాలను చక్కగా పండిస్తూ నడిపించారు.

ఈ రోజున మరలా వెబ్ మీదపడి కొంచెం గాలించగా http://www.wikiwand.com/te/శ్రీ_సూర్యరాయ_విద్యానంద_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-2  అనే పేజీలో స్వయంప్రభ అన్న 771వ entry కనిపించింది. అది ఈ పుస్తకమే ఐతే ఆనందమే.

28, ఫిబ్రవరి 2017, మంగళవారం

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

మొక్కులు ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ? అని వనం జ్వాలానరసింహారావు గారు తన బ్లాగులో ఒక వ్యాసం‌ ప్రకటించారు. ఆ బ్లాగు శీర్షిక ప్రకారం ఆ వ్యాసం ఈనాటి ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉండాలి.  వారు లబ్ధప్రతిష్ఠులు. మంచి విషయపరిజ్ఞానమూ‌ పలుకుబడీ‌ ఉన్నవారు కాబట్టి వారు వ్రాసినదల్లా అచ్చయ్యో పరిస్థితి ఉండవచ్చును కాని వ్రాసినదల్లా అంగీకారయోగ్యం‌ కావలసిన అవసరం లేదు.

"దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. అన్నారు వారు. అక్షరసత్యం. శ్రీ పివీఅర్కే ప్రసాద్ గారి నాహం‌కర్తా హరిః కర్తా అన్న పుస్తకంలో కూడా ఈ‌విషయమై ఒక మంచి ఐతిహ్యం‌ ఉంది. కాని అధికారిక పదవుల్లో ఉన్నవారికి దొరికే ప్రత్యేకదర్శనాలు ప్రత్యేకవిషయాలు. వాటికి ఈ‌నియమం పూర్తిగా వర్తించక పోవచ్చును. అనునిత్యమూ బంగారుపూలతో పూజించిన చక్రవర్తికంటే అడపాదడపా తనకోసం ఒక మట్టిపూవును సమర్పిస్తూ కుండలు చేసుకొనే సామాన్యుడే తనకు అత్యంత ప్రీతిపాత్రుడని స్వామివారే స్వయంగా తెలియజేసిన వృత్తాంతాన్ని స్మరించుకోవాలి ఇక్కడ మనం. తామున్న స్థితి కారణంగా సులభంగా తమ విగ్రహసాన్నిధ్యాన్ని పొంది గర్వించినంత మాత్రాన ఎవరికీ అది తమ ఆత్మీయ సన్నిథి కాదని స్వామివారి సూచన అని గ్రహించటం మంచిది. నిత్యం కేవలం‌ సినీమానటులైనంత మాత్రనే లేదా మరొక పలుకుబడి కల వ్యక్తి ఐనంత మాత్రనే ఎవరెవరో ఎందరెందరో‌ స్వామివారిని దర్శనం చేసుకొని వెడుతున్నారు. వారందరిని స్వామివారు ఆత్రుతతో పిలిపించుకొన్నారని అనుకో గలమా? అసలు వీళ్ళంతా స్వామివారి దర్శనం కోసం వస్తున్నట్లు కాక స్వామివారికి దర్శనం ఇవ్వటానికి వస్తున్నట్లుగా హడావుడి చేస్తున్నారు. శాంతమ్‌ పాపమ్.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం అని వనం వారి అభిప్రాయం. ప్రభుత్వపరంగా సొమ్ము వెచ్చించాలంటే అది ప్రభుత్వం‌ తీర్మానం చేయటం అన్న క్రియాకలాపం ద్వారా జరగాలి కదా? అలా జరగక పోతే అది అనుచితం కాదా?  రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగుకోసం, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మొక్కులు చెల్లించుకోవడంలో తప్పేంటో అర్థం కాకపోవటం‌ చిత్రం. ప్రభుత్వమే ఒక తీర్మానం చేయకుండా ఎంత ముఖ్యమంత్రి ఐనా ప్రభుత్వధనాన్ని నేరుగా ఎలా వినియోగిస్తారు? ఇవే ఉద్దేశాలను చూపి మరికొందరు మంత్రులూ‌ ఈ పని చేస్తే సదరు ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ఏమన్నా ఉందా? ఏమని వారిస్తారు? అసలు వారిస్తారా? ఇలా ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకోసం క్రతువులూ మొక్కులూ‌ అని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తుంటే రేపొక కార్యనిర్వహణాధికారో‌ మరొక అధికారో అలాగే ఖజానా సొమ్ముతో యాగాలూ దేవుళ్ళకు ఆభరణాలూ చేయిస్తే ఏమి చేస్తారండీ? వారిది తప్పు అంటారా? ఏ అధికారంతో? తాము చేస్తే ఒప్పైనది ప్రజలకోసం అన్న ఆ మిషలతోనే వేరొక అధికారి చేస్తే తప్పే విధంగా అవుతుందీ?


రాష్ట్రం ఏర్పాటైతే ఫలానా...ఫలానా...దేవుళ్లకు , ఫలానా...ఫలానా ఆభరణాలు మొక్కుగా చెల్లిస్తానని సీఎం కాకముందు కేసీఆర్ మొక్కున్నారు అని వనం వారి వక్కాణింపు. నిజమే  కావచ్చును. అప్పట్లో వ్యక్తిగతంగా మొక్కుకున్న మొక్కుబడిని ఇప్పుడు అధికారిగా ఎలా తీరుస్తారూ?  ఒకానొక వ్యక్తి నాకు ఉద్యోగం వస్తే పదివేలు హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. ఆఫీసు సొమ్ము పదివేలను తీసుకొని వెళ్ళి దేవుడి హుండీలో వేసాడు. అది తప్పా ఒప్పా అన్నది పాఠశాలా విద్యార్థిని అడిగినా చెబుతాడు. అవునా కాదా?

సీఎం ఎప్పుడూ తన సొంత డబ్బుతో మొక్కులు చెల్లిస్తానని అనలేదే? అలాంటప్పుడు ఎందుకీ విమర్శలు? అని వనంవారి సమర్థన. బాగుంది. ఇందాక చెప్పిన పిట్టకథలోని వ్యక్తి ఆఫీసు సొమ్ము వేస్తే తప్పేమిటీ నా సొంత డబ్బును హుండీలో వేస్తానని మొక్కుకోలేదే అంటే ఏమన్నమాట? ఈ‌  సమర్థన కూడా అలాగే ఉంది కదా? ఏమన్నా బాగుందా?

కేసీఆర్ గారి ఘనతను వనం వారు ఇలా సెలవిచ్చారు. "గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసిఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని టీటీడీ కార్యనిర్వహణ అధికారి స్వయంగా అన్నారు. ప్రభుత్వ పరంగా, శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు లాంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆభరణాలు సమర్పించడం కొత్తేమీ కాదనే కదా అర్థం?"  వనం వారు చెప్పేది భలేగా ఉంది. మహారాజులతో ముఖ్యమంత్రులకు పోలిక ఎందుకు? అది చెల్లని వాదన. రాజు సర్వస్వతంత్రుడు. ఆయన చేసే ఖర్చుకు ఎవరికీ‌ రాజు జవాబుదారు కాడు. కాని ముఖ్యమంత్రి కూడా ఒక రాజులాగా ఎవరికీ జవాబుదారు కాని వ్యక్తిగా ఉంటాడా ఎక్కడన్నా? అలోచించండి. కేసీఆర్ గారు నెలకొల్పిన కొత్త సంప్రదాయం అల్లా ప్రభుత్వధనాన్ని ముఖమంత్రి యధేచ్ఛగా వెచ్చించవచ్చును అన్నదే కాని తదన్యం కాదు.

"ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు." అని తన పూర్వానుభవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ అన్నమాట ఉచితంగానే ఉంది. కాని అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కొండకు వచ్చినా, సెలబ్రిటీలం అంటూ చివరకు సినిమావాళ్ళు వచ్చినా ఆలయాధికారులు పూర్ణకుంభాలతో‌ మేళతాళాలతో వారికి ఎదురేగి స్వామివారి తరపున అన్నట్లు మహారాజమర్యాదలు చేయటం అన్న చెడ్ద సంప్రదాయం కొనసాగుతోంది నేడు. ఇదంతా దేవుడే నిర్ణయించి అర్చకస్వాముల్ని పురమాయించి చేయిస్తున్నాడని వనం వారు నమ్మి మనని నమ్మమంటే వారికొక నమస్కారం.

మరి ఎందుకీ అర్థం లేని విమర్శలు? అని వనం వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా విమర్శలను అర్థం లేనివి అన్నంత మాత్రాన తప్పులు ఒప్పులై పోతాయా?

23, ఫిబ్రవరి 2017, గురువారం

శివస్తుతిభజే శంభు మీశాన మానంద కందం
భజే సర్వలోకైకనాథం‌ మహేశం
భజే పార్వతీవల్లభం‌ పాపనాశం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే కాలకాలం ప్రపన్నార్తినాశం
భజే యక్షరాజేంద్రమిత్రం పవిత్రం
భజే వాయుభుంగ్మాలికాభూషితాంగం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే సర్వలోకేశసంసేవ్య మూర్తిం
భజే సర్వమౌనీంద్రసంచిత్య మూర్తిం
భజే సాంబమూర్తిం సదాశాంతమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే వేదవేదాంగసంస్తుత్య మూర్తిం
భజే మౌనముద్రాస్థితం జ్ఞానమూర్తిం
భజే ధ్యానమూర్తిం పరబ్రహ్మమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే రుద్రమూర్తిం భజే భద్రమూర్తిం
భజే ప్రాణమూర్తిం భజే విశ్వమూర్తిం
భజే యోగమూర్తిం భజే లింగమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం


12, ఫిబ్రవరి 2017, ఆదివారం

అవనిపై నుండు వా రందరు నిటులే


అవనిపై నుండు వా రందరు నిటులే
యెవరి దారి దగుచు నేగెడు వారే

ఎవరి నడక వారిది యెవరి నడత వారిది
ఎవరి బలిమి వారిది యెవరి కలిమి వారిది
ఎవరి పలుకు వారిది యెవరి గిలుకు వారిది
ఎవరి పదము వారిది యెవరి చదువు వారిది
అవని

ఎవరి కులుకు వారిది యెవరి ఉలుకు వారిది
ఎవరి తెగువ వారిది యెవరి తెగులు వారిది
ఎవరి తలపు వారిది యెవరి వలపు వారిది
ఎవరి మెతుకు వారిది యెవరి బ్రతుకు వారిది
అవని

ఇవల సకల జీవులు తివురు వికట విధమిది
యవల కలుగు జీవిత మెవరి కెఱుక గానిది
ఎవడు రామచంద్రుని యెఱిగి కొలుచు నాతడె
ఇవల నవల రాముని యెదుట నుండు నెప్పుడు
అవని