18, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బని యేమి

ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బనియేమి
శాశ్వతసుఖమే నాదైతే క్షిణికసుఖంబుల పనియేమి

ఎఱుగదగినదే యెఱిగితినా యితరవిద్యలే వలదు కదా
పొరబడి హరినే మరచితినా పొందగలిగినది లేదు కదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా
ఈశ్వరుడే

చిరుచిరువరములు కురిసేవారగు సురలనడుగుటే వలదుకదా
పొరబడి యడిగి తప్పైనదని పొగులుకర్మమే వలదుకదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరాముడు నన్ను పాలించుటయే చాలు గదా
ఈశ్వరుడే

అరకొర బ్రతుకుల నరులకు దొరకని హరికృప దొరకిన చాలుగదా
పరమభాగవతజనమందారుడు వదలకబ్రోచిన చాలుగదా
కరుణాకరుడు సుగుణాకరుడు నిరుపమసుఖసంపత్కరుడు
పరమాత్ముడు శ్రీరామముడు నన్ను పాలించుటయే చాలుగదా
ఈశ్వరుడే