28, జూన్ 2016, మంగళవారం

ఫలించిన జోస్యం - 7 (మోడీసాయిబు జోస్యం)


(మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం ఐదవభాగం  ఆరవభాగం)

  మేము  గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు వచ్చామన్న సంగతి లోగడ ఒకటి రెండు సంధర్భాల్లో ప్రస్తావించాను కదా.  అక్కడి నుండి ప్రారంభించాలి ఈ‌ కథనాన్ని.

గెద్దనాపల్లె అన్నది గ్రామనామం. కాని లోకులంతా  గెద్దనాపిల్లి అనో గెద్దనాపల్లి అనో‌ పిలిచేవారు. కొందరు గ్రద్దనపల్లె అని కొంచెం గ్రాంథికం చేసేవారు. సరైన పేరు ఏమిటో మరి. ఈ గ్రామం‌ కిర్లంపూడి పక్కన ఉంది. అమలాపురానికి కొద్ది దూరంలో మరొక గద్దనాపల్లె ఉందిట, ఈ మధ్యనే విన్నాను.

మేము ఆ ఊరికి వచ్చిన కొత్తలో, తొయ్యేటి శంకరంగారని ఒక పురోహితులవారి యింట్లో ఉండే వాళ్ళం.  తరువాత కరంణంగారి ఇంటికి మారాం. ఆయన పేరు సోమప్ప గారు. ఆయన అసలు పేరు సోమరాజుగారు. ఇంటి పేరు తురగావారని గుర్తు. కరణంగారికి సోమప్ప అన్నది వ్యవహారనామం అన్నమాట. ఆయన పెద్ద తమ్ముడు గవరప్ప. చిన్నతమ్ముడు సత్తెప్ప. గవరప్పకు వేరే చోట ఉద్యోగం. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇంట్లో అన్నపూర్ణమ్మగారూ, సోమప్పగారూ, సత్తెప్పా, వారి వితంతుసోదరి రాముడు ఉండేవారు. రాముడు అనే అమె అసలు పేరు రామలక్ష్మి అని గుర్తు.

ఈ సత్తెప్ప ఒకటో రకం బేకార్ టీనేజర్. ఊళ్ళోని క్లబ్బువద్ద జనం కాల్చిపారేసిన సిగరెట్ పీకలు పోగేసి వాటితో దమ్ము కొట్టి దొరికిపోయి తన్నులు తింటూ‌ ఉంటే వాడు. ఒకసారి అతను ఆ ఎంగిలిపీకలు ఏరుతుంటే అదే‌ంపని అన్నాను. దానికి అతడిచ్చిన సమాధానం‌ 'సిగరెట్ మజా నీకేం తెలుసురా' అని! సోమప్పగారు నిజంగా చాలా పెద్దమనిషి.

అ సత్తెప్ప అన్నగారి చేతుల్లో దెబ్బలు తింటున్న  ఒక సందర్భంలో నేను భయంభయంగా చూస్తూ‌ ఉంటే మా బామ్మగారు జన్మమొత్తానికి సరిపోయే గుణపాఠం లాంటి మాట అన్నారు, 'రేపు నువ్వూ‌ బుధ్ధిగా ఉండకపోతే నీకూ ఇలాగే తన్నులు తప్పవూ' అని. ఎందుకన్నా రంటే సత్తెప్ప అస్తమానం నన్ను వెంటేసుకొని తిరుగుతూ‌ఉండే వాడు కదా, వాడి సావాసం వదలూ అని హెచ్చరించటాని కన్నమాట!

కరణంగారింట్లో‌ జరిగిన తమాషాలు అన్నీ‌ చెప్పటానికి ఇది సందర్భం‌ కాదు. ఇక్కడ చెప్పవలసిన సంఘటన ఒకటి ఉంది కాబట్టి ఈ‌ నాలుగు మాటల ఉపోద్ఘాతమూ వ్రాసాను.

ఒకనాడు ఒక విప్రవినోది వచ్చాడు. వాడి కూడా అతడి కొడుకు నాయీడు వాడొకడు. అతను అరుగుమీద కూర్చుని ఎన్నో వినోదాలు చూపించాడు. కరణంగారు వాళ్ళకు భోజనం పెట్టించి కొంచెం డబ్బు ఇచ్చారు. మా నాన్నగారూ వాళ్ళకి డబ్బులిచ్చారు.

విప్రవినోదులంటే ఈ‌కాలం వాళ్ళకి తెలియక పోవచ్చును. వాళ్ళూ గారడి విద్యతో పొట్టపోసుకొనే వాళ్ళే. ఈ‌ ఇంద్రజాలికులు బ్రాహ్మణులు. వీళ్ళల్లో రెండురకాల వాళ్ళున్నారు. కొందరు తమవిద్యను జనబాహుళ్యం‌ ముందు ప్రదర్శిస్తారు. కొద్దిమంది మాత్రం తమ విద్యను బ్రాహ్మణుల ఇండ్లలో తప్ప ఎన్నడూ మరెక్కడా ప్రదర్శించరు.ఈ వచ్చిన వాళ్ళు ఇటువంటి నిష్టగలవాళ్ళు. కాకపోతే కరణంగారి చిన్న పెంకుటింటికి ఎదురుగా పంతంవారి బ్రహ్మాండమైన మేడ ఒకటుంది. ఆ ఇంటాయన పేరు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. కరణం గారింటికి ఎడమ ప్రక్కన మరొక బ్రహ్మాండమైన మేడ ఉంది. ఆ యింటాయన పేరు పంతం‌ ప్రసాదరావుగారు. ఇంకా ఆ ఊళ్ళో, ఆమాటకు వస్తే ఆ వీధిలోనే సంపన్నగృహాలున్నాయి తగినన్ని. కాని ఈ‌యింద్రజాలికులు మాత్రం ఒక సాధారణ బ్రాహ్మణగృహస్థు ఇంటికి వచ్చి విద్యాప్రదర్శనం చేసారు.

ఈ సంఘటనలో పెద్దగా విశేషం ఏమీ‌ కనబడటం‌ లేదంటారా? ఉందండి. నాకు ఈ‌ ఇంద్రజాలం‌ పరమాధ్బుతంగ ఉండి ఆ తరువాతి కాలంలో కొత్తపేటలో ఎక్కడ ఎవడు మోడీ‌కట్టినా సరే కుతూహలంగా వాళ్ళ విద్యలు చూదామని చివరిదాకా ఓపిగ్గా నిరీక్షించేవాడిని. కాని దాదాపు అందరూ సోదిగాళ్ళే వాళ్ళల్లో.

ఒక్కరు తప్ప.

అప్పటికి నేను పెద్దతరగతుల్లోనే ఉన్నాను. తొమ్మిదో పదో. సరిగా గుర్తులేదు.

కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఎదురుగా కొన్ని చెట్లున్నాయి రోడ్డుమీద. వాటిక్రింద పళ్ళు అమ్మేవాళ్ళవి మూడో నాలుగో‌ చిన్నదుకాణాలు ఉండేవి. అక్కడ పిల్లామేకాతో సహా కొంచెం‌ జనసమ్మర్ధం ఉండేడి. కాబట్టి ఒక మోడీ‌సాయిబు హడావుడి చేస్తున్నాడు, ఒక రోజున.

సరే నేనక్కడ తయారు.

మోడీకట్టే‌ సాయిబుకు ఒక నలభై ఉంటాయి. కొంచెం దూరంలో ఒక చిన్నపిల్లవాడు డప్పుకొడుతున్నాడు. మరొక ప్రక్కన మరొక ముసలతను చిన్న మురళీ వాయిస్తున్నాడు. అది అరోజుల్లో అప్ప్పుడప్పుడూ పండగతీర్థాల్లో అణాకో బేడకో అమ్మే బాపతు మురళీ అన్నమాట.

కొన్ని చిల్లరమల్లర ట్రిక్కులు చూపించాక, తానొక పెద్ద విద్య చూపించబోతున్నానని జనాన్ని ఆ అబ్బి ఊదరగొట్టటం మెదలు పెట్టాడు.

ఏమిటేమిటో‌ చేస్తున్నాడు. ఏమీ క్రొత్తవిశేషం‌ కనిపించటం‌ లేదు. సరిగా కుదరటం‌ లేదేమో. చుట్టూ మూగిన జనానికి దొరక్కుండా ఉండటానికి ఏవేవో‌ జోకులు పేలుస్తూ హడావుడి చేస్తున్నాడు.

కొంచెం సేపు ఇలా గడిచాక, మురళీ పట్టుకొని ఒక పెడగా కూర్చున్న ముసలాయన లేచి వచ్చాడు.

కళ్ళతో‌జనాన్ని పరికిస్తూ ఒకసారి తిరిగాడు బరి చుట్టూ. మరలా తిరుగుతూ తిన్నగా నా దగ్గరకు వచ్చి ముఖం‌లో ముఖం పెట్టి చూస్తూ ఒక క్షణం చూసాడు.

హస్తానక్షత్రం దేవగణం
గండాలమారి జాతకం‌ గట్టి జాతకం
వెన్నుకాచి రాముడు తోడున్న జాతకం
దేవుడి ముందు మనమంత్రాలా తప్పు తప్పు

అని గట్టిగా అరుస్తున్నట్లు చెప్పాడు.

నాది హస్తానక్షత్రం. ఆసంగతి ఆతని కెట్లా తెలుసు!
నేను అప్పటికే రామభక్తుణ్ణి.  ఆసంగతి కూడా ఆతని కెట్లా తెలుసు!

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ ముసలతను వెనక్కు వెళ్ళి ఒకఅరటిపండూ తాంబూలమూ‌ తెచ్చి నా చేతిలో‌ పెట్టాడు.

ఇక్కడ అతనన్న మాటలు సరిగా గుర్తుకు రావటం‌లేదు. కాని నేను తాంబూలం తీసుకొని అనుమతి దయచేస్తేనే అక్కడ తమ కనుకట్టు విద్య పారుతుందట!

ఈ‌సంఘటన నన్ను అబ్బురపాటుకు గురిచేసింది.

నాకు గుర్తున్నంతవరకూ ఆరోజున నేను కొన్ని బత్తాయిపళ్ళు కొనటానికి అక్కడకు వచ్చాను. అవి జబ్బుగా ఉన్న మానాన్నగారి కోసం రసం తీసి ఇవ్వటానికి. బాల్య చాపల్యం‌కొద్దీ‌ ఆ మోడీ చూస్తూ‌ చాలాసేపే అక్కడ ఉండిపోయాను. ఒక గంట సేపన్నా అలస్యంగా ఇంటికి వెళ్ళాను.

మా అమ్మగారు ఇచ్చిన బత్తాయి రసం‌ మానాన్నగారు తాగుతున్నప్పుడు జరిగిన సంగతి అంతా చెప్పాను.

మా నాన్నగారు మాత్రం వాళ్ళు ఏవేవో‌ చెబుతూ‌ ఉంటారు జనరంజకత్వం‌ కోసం. ఆ మాటలన్నీ‌ పట్టించుకోకు అన్నారంతే.

మా అమ్మగారు మాత్రం కంగారు పడ్డారు.

మా బామ్మగారూ‌ మా అమ్మగారూ‌ కలిసి దృష్టి తీసారు.

ఈ‌సంఘటన ప్రభావం బాగానే కనిపించింది. నేను బయటకు వెళ్ళి వచ్చినప్పుడల్లా మా అమ్మగారు దిష్టితీయటం‌ మొదలుపెట్టారు. కొన్నాళ్ళ తరువాత మా బామ్మగారు ఒకచోట ఏదో‌ భజన జరుగుతుంటే అక్కడకు వెళ్ళారు. అక్కడ ఎవరో‌ హరనాథబాబా భక్తులట - వాళ్ళు భజన అయ్యాక అందరికీ ప్రశ్నలకు జవాబులు చెబుతుంటే నాభవిష్యత్తు గురించి మా బామ్మగారు ప్రశ్నవేసారు.

వాళ్ళు మరేమీ‌ భయం లేదనీ, భవిష్యం బాగా ఉంటుందనీ చెప్పాక కుదుటపడి, ఆ వార్తను  మా అమ్మగారి చెవినీ నా చెవినీ వేసారు.

ఈ మోడీ‌సాయిబులు నిజంగా సాయిబులేనా?‌ వాళ్ళు రాముడి పేరు కూడా ఎత్తారే అని నాకు చాలా అనుమానంగా ఉండేది.

హైదరాబాదు వచ్చిన క్రొత్తలో నిజంగానే మంచి రామభక్తుడైన ఒక పిల్లవాడిని చూసాము. అతడిని గురించి ప్రస్తావిస్తూ‌ మా అమ్మగారు 'తురకల్లోనూ రామభక్తులు చాలామందే ఉంటారని' వ్యాఖ్యానించారు.

అలాగే ఆ మోడీ‌సాయిబులు నిజంగా సాయిబులేనేమో.

ఇక జోస్యం విషయానికి వస్తే అతడన్నది కాలక్రమంలో అక్షరసత్యంగా జరుగుతున్నది.

నాకు అనేక ప్రాణగండాలు తలవెంట్రుక వాసిలో‌తప్పిపోయాయి మరి.

ఈ‌‌టపా పెద్దదైపోయింది కదా. వాటి గురించి వచ్చే టపాలో వ్రాస్తాను క్లుప్తంగా.