21, జనవరి 2016, గురువారం

రామకృపాశుధ్ధధార.







    శుధ్ధధార.
    భూమిమీద సర్వముం బుట్టిగిట్టు చుండు నం
    దేమి కోరుకొందురా యేల కోరుకొందురా
    తామసించి కోరుటే దప్పు తప్పు తప్పురా
    రామచంద్ర కోరగారాదు నీకు నన్యమున్




శుధ్ధధార.

గణవిభజన ర-జ-త-ర-వ.పాదానికి 14అక్షరాలు. గురులఘుక్రమం UIU IUI UUI UIU IU. ఈ‌వృత్తానికి యతిమైత్రిస్థానం వివరాలు లక్షణకారులు ఎక్కడ అని నిర్దేశించినదీ తెలియదు. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని మనం ఇలా UI UI UI U UI UI UI U అని చూస్తే బాగుండవచ్చును. అంటే హ-హ-హ-గ -హ-హ-హ-గ అన్నమాట. అప్పుడు యతిమైత్రిస్థానం 8వ అక్షరంగా నప్పుతున్నది.

ఇక శుధ్ధధార నడక విషయాన్ని చూదాం. శుధ్ధధార గణవిభజనను హ-హ-హ-గ -హ-హ-గ అని భావించి తదనుసారిగా వ్రాయటమే సుకరంగా ఉంటుంది కాని త్రికగణాలతో దీని కూర్పును సరిగా పట్టుకోవటం‌ కష్టం. హ-గణ ప్రయుక్తంగా మనం విభజన చేసుకున్నప్పుడు హ-గణాలు త్రిమాత్రాగణాలు కావటమే కాదు, మధ్యలో ఉన్న గురువు కూడా త్రిమాత్రాప్రమాణంగా నడుస్తుంది. పాదాంతంలో ఉన్న గురువును ఎలాగూ మనం త్రిమాత్రాప్రమాణంగా చూడవచ్చును. అందుచేత ఈ‌ పద్యం‌ నడక త్రిస్రగతిలో చక్కగా ఉంటుంది.

ఈ శుధ్ధధారకు కల పూర్వకవి ప్రయోగాలు తెలియవు.
  
పైన చెప్పిన పద్యం‌ నడక ఇలాగు ఉంది:

భూమి మీద సర్వ ముం బుట్టి గిట్టు చుండు నం
దేమి కోరు కొందు రా యేల కోరు కొందు రా
తామ సించి కోరు టే తప్పు తప్పు తప్పు రా
రామ చంద్ర కోర గా రాదు నీకు నన్య మున్