22, జనవరి 2016, శుక్రవారం

శ్రీరామ ప్రణవము.







       ప్రణవము.
       వేదోధ్దారక విధిశక్రేశా
       నాదుల్గొల్చెడు హరివీవయ్యా
       నాదైవంబవు నరనాథా నా
       చేదోడై నడచెడు శ్రీరామా




ప్రణవము.

ఈ‌ ప్రణవ వృత్తానికి గణవిభజన మ-న-య-గ. అంటే పాదానికి 10అక్షరాలు. యతిస్థానం 6వ అక్షరం. గురులఘుక్రమం U UUIIIIUUU.ఈ గురులఘుక్రమాన్ని కుడినుండి వెనుకకు చదివినా అదే వస్తుంది.

ఈ ప్రణవవృత్తానికే పణవ అనీ, పణవకం అనీ‌ హీరాంగి అనీ వేర్వేరు పేర్లు కూడా కనిపిస్తున్నాయి.

పణవ అనే పేరుతో మరొక వృత్తం‌ కూడా  మ-న-జ-గ అనే గణవిభజనతో‌, అంటే UUU III IUI U అనే గురులఘుక్రమంతో‌ కనిపిస్తున్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రణవ లేదా పణవ వృత్తానికీ ఆ పణవవృత్తానికి తేడా య-గణం బదులుగా జ-గణం రావటమే. అంటే తొమ్మిదవస్థానంలో మనం గురువును తీసుకొంటే‌ ఆ వృత్తంలో లఘువన్నమాట.

ఈ ప్రవణ వృత్తానికి దగ్గరి చుట్టం వనితాభరణం అనే మరొకవృత్తం. ఈ ప్రణవవృత్తంలో ముందు వెనుకల గగ-గణాలలో ముందున్న దాన్ని  భ-గణంగా చివరి గగ-గణాన్ని స-గణంగా మార్చితే వనితాభరణం ఐపోతుంది. మాత్రలలో తేడారాదు. చివరి గగ-ను మార్చకుండా వదిలేస్తే అది శ్రితకమలా వృత్తం అవుతుంది. మొదటి దాన్ని మాత్రమే మార్చితే అది కుశల కళావాటిక అవుతుంది. గందరగోళంగా ఉందా? ఈ విధంగా చూడండి:

ప్రణవంUU  UIIIIU UU
వనితాభరణంUII UIIIIU IIU
కుశలకళావాటికUU  UIIIIU IIU
శ్రితకమలUII UIIIIU UU

ఈ ప్రణవ వృత్తానికి బంధువర్గాన్ని చూదాం. ఈ‌ వృత్తపాదానికి ఇరుప్రక్కలా ఒక్కొక్క గురువును తగిలిస్తే అది జలధరమాలా వృత్తం అవుతుంది. ఒక్కొక్క గురువుకు బదులుగా రెండేసి గురువులను తగిలిస్తే అది వాసంతీవృత్తం అవుతుంది. వాసంతీ వృత్తానికి చివరన ఉన్నగురువును మొదటికి మార్చితే అది కాలధ్వానం అనే వృత్తం అవుతున్నది. జలధరమాలకు చివర మరొక గురువును తగిలిస్తే అది లీలాలోలావృత్తం అవుతుంది.

ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని  UU UII IIU UU అని గగ-భ-స-గగ వలె కూడా విడదీసి చూదవచ్చును. ఇప్పుడు చక్కగా అన్నీ‌చతుర్మాత్రాగణాలు కనిపిస్తున్నాయి కదా. అందుచేత దీని నడక చతురస్రగతిలో ఉంటుందని స్పష్టం అవుతున్నది