15, ఏప్రిల్ 2015, బుధవారం

నే నుంటి నందునా నీవుంటి వందునా

నే నుంటి  నందునా నీవుంటి వందునా
నేనె నీ వందునా నిజమేమి టందునా

శ్రీరామ నిజమెన్న జీవరాసుల కెపుడు
తారుండు విధమైన తెలియరాకుండు
ఏ రీతి పరతత్త్వ పారమ్యమును గూర్చి
గోరంతయును పోల్చుకొనవచ్చు గాన ॥ నే నుంటి॥

జానకీరమణ నీ చరణాంబురుహములను
పూని గొల్చెదగాన బుధ్ధిలో కొంత
నేను  నీ వాడనను ఙ్ఞానలేశంబు
మానక కలుగెనే మరియందు చేత ॥నే నుంటి॥

తొడిగిన తొడగులు తొడగక కొన్ని
తొడిగిన వంటివే తొడుగుచు కొన్ని
ఉడిగితి తుదకు నా యున్కిపై భ్రాంతి
కడకు నీ యందె నే కలసితి గాన ॥నే నుంటి॥