23, ఫిబ్రవరి 2015, సోమవారం

అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ







ఇది అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ.


అచ్చతెనుఁగు కావ్యం‌ అంటే సంస్కృతపదాలూ, తత్సమాలూ ఏవీ వాడకుండా కేవలం తెలుగుపదాలతోనే నిర్మించిన కావ్యం అన్నమాట.

ఈ శృంగారశాకుంతలం అనే అచ్చతెలుగు కావ్యాన్ని వ్రాసిన కవిగారు కేసిరాజు సీతారామయ్యగారు. ఈ‌ కావ్యం ప్రథమ ముద్రణం 1959లో జరిగింది. నాకు తెలిసినంతవరకు, ప్రస్తుతం దీని ప్రతులు అందుబాటులో లేవు. ఈ కావ్యానికి జటావల్లభుల పురుషోత్తం గారూ, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారూ, చిలుకూరి పాపయ్యశాస్త్రిగారూ, ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రిగారూ, నండూరి బంగారయ్యగారూ తమతమ పండితాభిప్రాయాలను వ్రాసారు. కేసిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు విపులమైన పీఠికను వ్రాసారు.

ప్రస్తుతం ఈ‌ కావ్యంలో ఉన్న వృషభగతిరగడను అందిస్తున్నాను.మన తెలుగుకవులు రగడలను వాడింది తక్కువే. ఏదో‌ ప్రబంధనిర్మాణకార్యక్రమంలో కావ్యానికొకటి చొప్పున సంప్రదాయం పాటించటాని కన్నట్లుగా వ్రాయటమే కాని ఆట్టే మక్కువను రగడలపై ప్రదర్శించింది కనరాదు. ఈ శృంగారశాకుంతలంలో కూడా ఒక రగడ ఉన్నది. అది కావ్యం ద్వితీయాశ్వాసంలో ఉంది. ముద్రణలో పద్యాలకు సంఖ్యాక్రమం ఇవ్వలేదు కాబట్టి పద్యసంఖ్యను ఇవ్వటం కుదరదు. పుట సంఖ్య 39-40లో ఉందని మాత్రం వివరం ఇవ్వగలను.

ఇది వృషభగతి రగడ అని చెప్పాను కదా. మనకు రగడలు ఆట్టే ప్రచారంలో కనిపించవు కాబట్టి, ఈ వృషభగతి రగడ లక్షణం మొదట వివరిస్తాను. మాత్రాఛందస్సు. పాదానికి 28 మాత్రల చొప్పున రెండు పాదాలు ఒక పద్యం. అంటే నాలుగు సప్తమాత్రాగణాలుగా ఉంటుంది. సప్తమాత్రలగణం అంటే ఒక సూర్యగణం పైన ఒక చతుర్మాత్రాగణం అన్నమాట. చతుర్మాత్రాగణంగా జగణం వదిలి భ,నల,గగ, స అనేవి వాడవచ్చును. (3+4) + (3+4) + (3+4) + (3+4) = 28 మాత్రలు అన్నమాట. ప్రాచీనకాలంలో రగడలకు ప్రాసనియమం లేకపోయినా తరువాత మనకవులంతా ప్రాసనియమం పాటించారు. మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం. దీని నడక మిశ్రగతి. వృషభగతికి త్రిపుటతాళం అని లక్షణశిరోమణిలో‌ రమణకవి ఉవాచ. రగడలలో అంత్యప్రాస సాధారణంగా ప్రయోగిస్తారు. కవుల రుచిభేదాన్ని బట్టి రకరకాల యమకాలూ అనుప్రాసలూ వగైరా కూడా యధేఛ్ఛ అన్నమాట. అలాగే లక్షణం ప్రకారం రెండుపాదాలు ఒక పద్యం ఐనా పద్యాలను తోరణంలా వ్రాసుకుంటూ పోతూ దండలాగా అనేకం గుదిగుచ్చుతారు.

సంప్రదాయికంగా మొత్తం రగడలోని పద్యాలన్నీ మధ్యలో ఖాళీలైనులు ఇవ్వకుండా ఒకే వరుసగా వ్రాసుకుంటూ పోతారు కాని పాఠకుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని నేను ఈ‌ రగడలో ఏ పద్యానికి ఆ పద్యంగా ఎత్తి వ్రాసాను. అదీ కాక, ప్రతిపాదాన్నీ రెండు భాగాలుగా చూపటం చేసాను - లేకుంటే పాదం మరీ‌ పొడుగ్గా అనిపించి కొందరు జడుసుకొనే ప్రమాదం ఉంది కదా నేటి కాలంలో. 

ఇక కవిగారు చెప్పిన వృషభగతి రగడ.


వెలఁది వెలఁది వెడంద కన్నుల
     విప్పువిప్పుట నంటి కప్రము
నలరు నలరుల రాల్చు పుప్పొడి
     నల్లనల్లన వీడు చప్రము

లేమ లేమరువంబు లవియే
     లెక్కలెక్కకు మీఱె మోవులు
కోమ కోమలికంబుగాఁ గొన
     గోర గోరఁటఁ ద్రుంపు పూవులు

మనము మన ముంగిటను నీ యెల
     మావి మావిరిబోఁడి యూయెల
కొనకకొన కటు తాపుచో ననఁ
     గోయఁ గోయని కూసె కోయల

తలఁప తలపంతం బదేలను
     దాకఁ దాకకు తీవ మిన్నది
చెలువ చెలువగు తావి నెలపూఁ
     జిట్టజిట్టలుగాగ నున్నది

తుఱుము తుఱుమున మొల్లమొగ్గలు
     తూలి తూలిక జాఱెవాడఁగ
చుఱుకు చుఱుకున వీచు తెమ్మెర
     జుమ్ము జుమ్మని తేంట్లు వీడఁగ

రంగు రంగుల పూల వేచిగు
     రాకు రాకుము కోయఁగా నిట
చెంగు చెంగున క్రోవి నీ ర్వెద
     జల్ల జల్లని రాలు పూలట

పొగడ పొగడఁగఁ బూచె నీ సుర
     పొన్న పొన్నదలిర్చె నల్లదె
నిగనిగని పురివిచ్చి యాడెడు
     నెమ్మి నెమ్మిని జూడ నల్లదె

పూని పూనిలువెల్ల రాల్పఁగ
     పూపపూప బెడంగు కనుమిది
జాన జానగు పూవుఁ గొమ్మల
     సారెసారెకు వంచకుము గుది

కుదుర కుదురుల నీరు వోయగ
     కొల్లకొల్లగఁ బూచె మల్లియ
పొదలు పొదలుట జూడుమీ యెల
     పోఁకపోకడ గనుము చెల్లియ

చెలియ చెలియలి ప్రేంకణం బిదె
     చేరి చేరిక ననల ద్రుంపకు
కలికి కలికితనంబు గాదిది
     కన్నె కన్నెర జేసి నింపకు

వలను వలనుగ నెగిరిపడు గొరు
     వంక వంకను జూడు మియ్యెడ
చిలుక చిలుకలు ముద్దుపలుకులు
     చేరు చేరువ నున్న కుయ్యిడ

తగవు తగవులమారి తుమ్మెద
     తారుతారుము మమ్ము వీడుము
నగడు నగడువడంగ నీకిది
     నాలి నాలితనంబుఁ జూడుము

మంచి మంచి రకాల పూలెన
     మాలి మాలియ గుత్తు మింతట
నంచు నంచుల తా మొడళ్ళను
     నలరు నలరులఁ గోసి రంతట