1, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 8 సుధాసింధోర్మధ్యే ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


8

సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే .
శివాఽకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్

ఇంతవరకూ మహామహిమాన్వితురాలు జగజ్జనని అని చెప్పిన తల్లి నివాసం ఎక్కడ అన్నదానికి సమయ మతానుసారంగా, ఈ శ్లోకంలో సమాధానం చెబుతున్నారు.

ఈ సమయమతం అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పుకుందాం.  శ్రీశంకరులు సౌందర్యలహరీస్తోత్రం అనే మహధ్భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. కేవలకైవల్య ప్రదాయకమైన మహిమాన్వితమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పరమేశ్వరుడే అమ్మవారిని ఉద్దేశించి చెప్పాడనీ దానిని కాలడి శంకరులు మనకు అనుగ్రహించారనీ ఒక ఐతిహ్యం. ఇది శ్రీవిద్యారహస్యసంపుటీకరణ మన దగ్గ స్తోత్రం. దీనిని బట్టి శ్రీశంకరులు శ్రీవిద్యా ఉపాసకులనీ శాక్తేయులనీ భావించవచ్చును. అయన సమయమత సిధ్ధులనే విశ్వాసం.  ఈ శ్రీవిద్య శ్రీశంకరుల అద్వైతానికి అభిన్నమైనదే. ఈ శ్రీవిద్యలో మూడు ముఖ్యమార్గాలున్నాయి.  అవి కౌలం, మిశ్రం, సమయం అనేవి. వీటిలో  వేదప్రమాణం కాల్దీ పారమార్థికమైనది కేవలం సమయమతమే.  మొదటి రెండూ వామమార్గాలనీ, ఈ సమయమతాన్ని దక్షిణామ్నాయమనీ పరిభాషగా వాడుక చేస్తూ ఉంటారు.  శంకరమఠాల్లో దక్షిణామ్నాయము అని వ్రాస్తూ ఉండటం చూసే ఉంటారు కదా.

సుధ అంటే అమృతం అని మనకు తెలుసు. సింధువు అంటే సంధర్భాన్ని బట్టి నది లేదా సముద్రం అని చెప్పుకోవాలి - ముఖ్యంగా సముద్రం అని చెప్పటమే రివాజు. కాబట్టి సుధాసింధువు అంటే అమృతసముద్రం.  సుధాసింధోః మధ్యే అంటే ఆ అమృతసముద్రం మధ్యలో అని.  ఆ అమృతసముద్రం మధ్యలో ఒక మణిద్వీపం ఉందట. అక్కడి విశేషం చెబుతున్నారు.

సురలు అంటే దేవతలు. విటపి అంటే చెట్టు.  సురవిటపి అదే దేవతల చెట్టు అంటే కల్పవృక్షం. వాటి అంటే తోట. కాబట్టి సురవిటపివాటీ అంటే కల్పవృక్షాలతోట అన్నమాట.  అంటే ఇప్పటి వరకూ మనకు ఆకచార్యులవారు చెప్పినది ఆ ద్వీపంలో కల్పవృక్షాలతోట ఒకటి ఉందని.  కొంత చిరునామా తెలిసింది కదా.

చింతామణి అంటే తెలుసుకదా.  ఇంద్రుడి దగ్గర ఉండే గొప్ప మణి. అదికూడా అడిగిందల్లా ప్రసాదిస్తుంది.  దాన్ని మించిన మణి ముల్లోకాల్లోనూ ఉండదు.  చింతామణిగృహం అని చెప్పారు.  దీని అర్థం ఏమిటంటే ఓ కొల్లలుగా చింతామణులున్నా యక్కడా - ఆ చింతామణులతోటి కట్టిన ఒక గృహం ఉందీ అంటున్నారు.  ఇంద్రుడి దగ్గర చచ్చి ఒక్కటంటే ఒక్క చింతామణి ఉంటే దాంతో విర్రవీగుతూ ఊరేగుతున్నాడయ్యా.  ఈ మహాభవనాన్ని చింతామణుల్నే వాడి కట్టారూ అంటే ఆ అమృతసముద్రం మధ్యలో కల్పవృక్షాలతోట ఉన్న దీవి వైభవం ఊహించుకోవలసిందే కదా!

ఆ చింతామణిగృహం నీపోపవనవతి అన్నారు. నీపం అంటే కడిమి చెట్టు. ఆ భవనం చుట్టు కడిమి పూల తోట ఒకటి ఉందట.  ఏం మామిడితోటలో ఒక ఇల్లు కట్టుకుని దాని చుట్టు ఒక పూలతోట పెంచుకోరూ జనం అలాగే అక్కడ ఆ వైభవమూ.

ఆ పిమ్మట ఆ యింటిలోనికి ప్రవేశిస్తే అందులో సంగతి ఎలా ఉండేదీ చెబుతున్నారు.

మంచె అంటే మంచం.  అంటే రోజూ మనం వాడే మంచం అనేది ఈ మంచె అనే సంస్కృతపదం నుండి వచ్చిందే అన్న మాట. భలే.  దాన్ని శివాకారే అన్నారు - అంటే అది శివా (శక్తి) ఆకారం కల మంచం అట.  ఆక్కడ అమ్మ ఉంది. ఎలా?

పరమశివపర్యంకనిలయగా అంటే ఎక్కడ? పరమేశ్వరుడు శయనించి ఉన్న ప్రక్కమీద.

ఆవిడ ఎలా ఉందట? చిదానందలహరిగా.  జ్ఞానస్వరూపంగా నిరతిశయమైన ఆనంద ప్రవాహస్వరూపంగా ఉందట.

అటువంటి అమ్మను గురించి అందరూ భావన చేయగలరా అని ప్రశ్నవేసి, దానికి సమాధానం చెబుతున్నారు. ఏమని?

అమ్మా, త్వాం - అంటే అలా (అమృతసముద్రం మధ్యలో, కల్పవృక్షాలతోటలో ఉన్న చింతామణీగృహంలో కేవలశక్తిస్వరూపమైన మంచం మీద, పరమేశ్వరుడితో ఏకశయ్యమీద )  చిదానందస్వరూపంగా ఉన్న నిన్ను  ధన్యాః - అంటే నీ అనుగ్రహప్రసాదం కారణంగా ధన్యులైన వారు కేవలం కొద్దిమంది మాత్రమే భజంతి- సేవించగలుగుతున్నారమ్మా అంటున్నారు.

ఇది స్థూలార్థం. బాగుంది కదా?

సమయమతానుసారంగా కొంచెం విపులీకరిస్తాను.

శ్రీచక్రంలో అధోముఖంగా ఉన్న నాలుగు శివాత్మకమైన యోనులూ, ఊర్ధ్వముఖంగా ఉన్న ఐదు శక్తియోనులూ కలిసి నవయోనులు (నవత్రికోణములు). ఈ‌ శ్రీచక్రంలో ఉన్న బిందుస్థానానికే సుధాసింధువని పేరు.  పంచయోనులే కల్పవృక్షాలు. దానిమధ్యభాగానికే మణిమంటపం అని పేరు. దానిలోనే దేవీమందిరం. అక్కడ మంచమే శక్తిస్వరూపమైనది.  ఆ మంచపు కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు. తలగడ మహేశ్వరుడు. పానుపు సదాశివుడు.  ఆ పర్యంకమందున్న శ్రీదేవి ఆ సదాశివుడే ఆలంబనంగా పానుపుగా ఆయనతో అభిన్న స్థితిలో నున్నది.  అవిడ కేవలం ఆనందప్రవాహస్వరూప.  ఇదంతా చాలా సంకేతాలతో కూడుకొని ఉండటం వలన అంత సులభంగా అవగాహన కాక పోవచ్చును.

ఇంకా లోతైన మంత్రశాస్త్ర సంబంధమైన వివరణ చెప్పుకోవాలంటే విస్తారంగా ఉన్నది. కాని విశేషంగా అది  గురుముఖంగా తెలియవలసినది. ఉపాసనద్వారా అవగాహనకు తెచ్చుకోవలసినది. అంతే కాని  వ్రాతలో చెప్పుటకు వీలైనది కాదు. శ్రీవిద్యాధికారులకు తప్ప ఇలా బహిరంగంగా వివరంగా చర్చించుకొనే విషయం కాదు.

ఈ శ్లోకాన్ని ప్రతిదినం‌ పన్నెండు సార్లు పారాయణం చేస్తూ ఉంటే అన్ని రకాల అడ్డంకులూ భయాలు తొలగి పోయి సకలకార్యాలు నెరవేరుతాయని చెప్పబడింది. వీలైతే పారాయణంతో పాటుగా అమ్మకు ఎర్రనిపూలతో‌ పూజ చేయాలి.  నైవేద్యం నల్లమిరియాలు.