15, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 18 తనుచ్చాయాభిః ...



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

18   

తనుచ్చాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః 
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః

శ్రీశంకరులు ఇంతకు ముందు మూడు శ్లోకాల్లో ప్రథమకూటమైన వాగ్భవకూటం యొక్క ధ్యానాన్ని వర్ణించారు. 

ఇప్పుడు రెండవది ఐన కామరాజ కూటాన్ని గురించి చెబుతున్నారు.

తరుణతరణి అన్నమాటకు అర్థం ఉదయసూర్యబింబం అని. తరుణం అంటే యౌవనము అనీ లేతది అనీ అర్థాలు రెండూ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి అర్థనిర్ణయం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అరుణిమ అనే కాంతి వర్ణం గురించి ప్రస్తావిస్తున్నారు చూడండి. అరుణిమం  అంటే ఎర్రదనం.  సూర్యుడు ఎర్రగా ఉండే సమయాలు రెండే రెండు. ఐతే అటువంటి సూర్యుడు ఉదయభానుడు కావాలి లేదా సాయంకాలం సూర్యుడు కావాలి. సాయంకాలం సూర్యుడు వయస్సు ఉడిగినవాడుగా వర్ణించటానికి బాగుంటుంది కాని వయస్సులో ఉన్న సూర్యుడిగా చెప్పకూడదు కదా? ఇక రెండవది ఐన ఉదయసూర్యబింబాన్ని స్వీకరించాలి మనం. అది అరుణిమం కలిగి ఉంటుంది కదా నిస్సందేహంగా.  అందుచేత ఇక్కడ తరుణతరణి అంటే బాలసూర్యబింబం అన్న మాట.

తరుణతరణి అంటే బాలసూర్యుడి యొక్క శ్రీసరణిభిః అని చెబుతున్నారు కదా. శ్రీ అంటే సౌభాగ్యమూ సంపదా అన్న అర్థాలు సరిపోలుతాయి. అవికలిగిన సరణిభిః అంటే వరుసలు లేదా వెల్లువలు ఏవి కాంతిపుంజాలే కదా.

దీనిని బట్టి తరుణతరణి శ్రీసరనిభిః అన్నదానికి భావం బాలసూర్యుడి ఎర్రని కాంతులవెల్లువ అనే సంపద అని తెల్లమౌతున్నది.  మరి శ్రీశంకరులు దీనిని ఎలా పోల్చుతున్నారూ? అమ్మా తేః తనుఛ్ఛాయాభిః అనగా నీ యొక్క శరీరకాంతి అలా బాలసూర్యకాంతిశ్రీలాగా ఉందీ అని చెబుతున్నారు.

అంటే బాలసూర్యుడు ప్రసరించే అందమైన ఎర్రని కాంతిపుంజాల సంపద భూలోకం అంతా పరచుకొని ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కదా. ఈ సంగతి అందరికీ ప్రత్యేకించి వివరించనక్కర లేదు కదా.  శ్రీశంకరులు ఈ‌ పోలికను మరికొంచెం దూరం తీసుకొనె వెళుతున్నారు చూడండి. ఆయన ఏమంటున్నా రంటే,

అమ్మ యొక్క ఎర్రని శరీర కాంతి ఏమి చేస్తోందీ అంటే దివం సర్వామ్‌ ఉర్వీమ్‌ అరుణిమ నిమగ్నామ్‌ అంటే దివం అనగా ఆకాశమూ (లేదా స్వర్గలోకమూ) ఉర్వీం అనగా భూలోకమూ అంతా కూడా అరుణిమ అనగా ఎర్రదనంలో నిమగ్నామ్‌ అంటే సముద్రంలో ములిగిపోయినట్లు ములిగిపోయేలా చేస్తోంది అంటున్నారు.

ఈ నీ‌ మనోహరమైన తనుఛ్ఛాయను, ఇలా బాలసూర్యకాంతిలాగా ఎర్రగా లోకాలన్నింటినీ ఒక ఎరుపుసముద్రంలో ముంచేస్తోందే దానిని యః స్మరతి అనగా ఏ సాధకుడు స్మరిస్తున్నాడో వాడు ఎలాంటి ఫలితం పొందుతున్నాడొ చెబుతున్నారు.

గీర్వాణగణికా అని అప్సరసలను ప్రస్తావిస్తున్నారు. గీర్వాణులంటే దేవతలు. గణిక అంటే వేశ్య. దేవవేశ్యలు అప్సరసలే కదా. వాళ్ళు ఎటువంటి వారట?

త్రస్యత్ వనహరిణ అంటే భయడ్డ లేడిపిల్లల వలె శాలీన నయనా అనగా సిగ్గుతో టపటపా కొట్టుకుంటున్న కళ్ళున్న వాళ్ళట.

వాళ్ళంతా కూడా అందులోనూ సహోర్వశ్యాః అని నిష్కర్ష చేసేసారు. ఎవరినీ వదలకుండా. చివరికి ఊర్వశితో సహా అందర్నీ కలేసి సంబోధిస్తూ, కతికతి అంటే అబ్బో వీళ్ళల్లో ఎందరెందరు న వశ్యాః భవతి అటువంటి సాధకుడికి లొంగకుండా ఉంటారూ అంటున్నారు.  అంటే ఇలాంటి సాధకుడికి ఊర్వశి వంటి అప్సరసలైనా లొంగి దాసోహం అంటారూ‌ అని ఆచార్యులవారు చెబుతున్నారు.

ఇక్కడ ఊర్వశిని పనిగట్టుకొని తీసుకొని రావటంలో ఒక గడుసుదనం ఉంది.  అప్సరస లందరిలోనూ అందగత్తె ఊర్వశియే. ఎందుకంటే తపస్సుచేస్తున్న నరనారాయణులను పరీక్షించటానికి అప్సరసలు వస్తుంటే కినిసి నారాయణుడి ఊర్వశిని సృష్టించాడట వాళ్ళందరి కంటే అందగత్తెగా - ఈ అప్సరసల దండు గర్వం అణచటానికి. అమ్మ అరుణిమను ధ్యానించే వాడికి ఊర్వశి కూడా ఊడిగం చేస్తుందీ అని ఆచార్యులవారి చమత్కారం.

అసలు ఈ అప్సరసలంతా దేవతాస్త్రీలు కదా, వాళ్ళకు కనురెప్పపాటే ఉండదు కదా మరేమిటీ వీళ్ళ కళ్ళు ‌టపటపలాడుతాయి బెదరిన లేడి కళ్ళలాగా అన్నారూ అని అనుమానం రావచ్చును. అమ్మ అనుగ్రహం ఉన్నవాడి ముందు ఈ వీరి దేవతాగర్వం అణిగి ఈ సిగ్గూ ఆందోళనా వచ్చేస్తాయీ అని శ్రీశంకరులు సూచిస్తున్నారన్న మాట.

ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైరోజులు పారాయణం. నైవేద్యం పాలపాయసము. తాంబూలం. ఫలితం సర్వమనో మోహనతా సిధ్ది.