11, అక్టోబర్ 2014, శనివారం

సౌందర్యలహరి - 16 కవీంద్రాణాం చేతః .....


మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


16

కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ 
విరించిప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ

గత శ్లోకం శరజ్యోత్సా శుధ్ధాం అనే దానిలో సరస్వతీ‌ప్రార్థనం చేసారు ఆచార్యుల వారు.  అది శుక్లవర్ణాత్మిక మైన సాత్వికధ్యానం.  ఇప్పుడు అరుణవర్ణాత్మిక మైన రాజసధ్యానంతో మరొక సరస్వతీ సంబంధమైన ధ్యానశ్లోకాన్ని చెబుతున్నారు.

అమ్మా శ్రీదేవీ నీవే సరస్వతివి.

నీవు కవీంద్రాణాం అనగా గొప్పగొప్ప కవుల యొక్క చేతః కమలవనః అనగా మనస్సులనే తామరపూల తోటలకు బాల + ఆతపః అంటే లేత ఎండ అనగా ఉదయపు టెండ వంటి రుచిమ్‌ అంటే ప్రకాశానివి.  ఉదయిస్తున్న సూర్యుడికి అరుణుడు అని పేరు. ఎందుకంటే ఉదయించే సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా అందుకని.  ఏ విధంగా లేత సూర్యుడి ఎర్రని అందమైన కిరణాలు తామరపూలతోట లన్నింటినీ వికసించేటట్లుగా చేస్తుంటాయో అదే విధంగా బాలసూర్యుడి తేజస్సు వలె అరుణామేవ అంటేఎర్రగానే ఉన్న నీ‌ తనుకాంతి దయతో కవీశ్వరుల మనః పద్మాలని వికసింపజేస్తున్నది అని చెప్పటం అన్నమాట.

అంత గొప్ప విశేషమైన అరుణ వర్ణం కలిగిన నిన్ను యే కతిచిత్ అంటే కొందరు మాత్రమే ఐన సంతః అంటే ఉత్తములు భజంతే అంటే శ్రధ్ధతో సేవిస్తున్నారో అని ప్రస్తావించి, అటువంటి మహాత్ములకు పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు శ్లోకం ఉత్తరార్థంలో (అంటే రెండవ సగంలో)

విరించిః ప్రేయస్యాః అన్న దానికి అర్థం సులభమే ఈ రెండు మాటలూ జనం వాడుకలో ఉన్నవే. విరించి అంటే బ్రహ్మగారు. ఆయన ప్రేయసి అనగా భార్య సరస్వతి.  సరస్వతిని శ్మరిస్తున్నారు శ్రీశంకరులు.

తరుణం  అంటే యౌవనప్రాయం. తరుణతరం అని చెప్పారు కాబట్టి అది మిక్కిలి యౌవనం అనగా నవయౌవనం అన్నమాట.

శృంగారలహరీ అన్నదానిలో లహరి అంటే ప్రవాహం. 

కాబట్టి తరుణతరశృంగారలహరీ అంటే నవయౌవన వికాసం యొక్క శృంగారభావ ప్రవాహం అని అర్థం, ఈ‌ సమాసాన్ని తీసుకొని వెళ్ళి విరించి ప్రేయస్యా అని సరస్వతిని సంభావించి చెప్పారు.

సరస్వతి యొక్కస్వరూపం యేమిటీ అది వాక్కు కదా. ఇక్కడ దానినే గ్రహిస్తే అర్థం ఎలా వస్తున్నదీ? ఎంతో కోమలమూ మహావిలాసవంతమైన నానాలంకారవిశేష సమన్వితమూ అత్యంత మనోహరమూ ఐన వాక్కు అని అర్థం వస్తుంది కదా? దానిని మనబోటి వారిని దృష్టిలో ఉంచుకొని కాబోలు స్పష్టీకరిస్తున్నారు. ఏమని గభీరాభిః వాగ్భిః అని అంటె అత్యంత గంభీరము ఐన వాక్కు అని. వాక్కు యొక్క గాంభీర్యం దానికి గల విశిష్టమైన గుణాలను బట్టి వస్తుంది కదా.  ఇక్కడ మరలా తరుణతర శృంగారలహరీ అని అనగా రసరాట్టు ఐన శృంగారంతో కూడిన  సెలయేటిప్రవాహం వంటి వాక్కు అని అర్థం చేసుకోవాలి మనం.

అటువంటి వాక్కు ఎవరికి సంక్రమిస్తున్నదీ అంటే అలా ఏ సంతః భజంతే అని చెప్పారు కదా వారికి అన్నమాట. ఎత్తుగడలోనే ఈ శ్లోకంలో కవీంద్రులని ప్రస్తావించారు కాబట్టి ఈ‌ సతాం అనగా సత్పురుషులు అంతా కవీంద్రులు అవుతున్నారన్న మాట చెబుతున్నారు. అటువంటి వాగ్భిః అనగా వాక్కులని ఈ సతాం అనగా సత్పురుషులు విధదతి అనగా వెలువరిస్తున్నారు అని చెప్పటం బట్టి వీళ్ళంతా గొప్పగొప్ప కావ్యాలు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారన్న మాట.

కొంతమంది అమ్మవారిని అరుణ అనే రూపంలో ధ్యానిస్తారు. 

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్

అని కదా శ్రీలలితాంబికా సహస్రనామస్తోత్రంలో ధ్యానశ్లోకం.

ఈ శ్లోకం కూడా దేవీ వాగ్భవకూటాన్ని గురించి చెప్పిన శ్లోకమే.

ఈ శ్లోకానికి నలభై ఒక్క రోజులు రోజూ వేయిసార్లు చొప్పున పారాయణం.  నైవేద్యం తేనె. ఫలం విద్యాగరిమ, వాక్పటిమ, కవిత్వశక్తులు.