13, డిసెంబర్ 2013, శుక్రవారం

సాగతీత?


అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!


ప్రత్యేకంగా యుధ్ధవిమానం
మోసుకు వచ్చెను విభజన బిల్లు
శ్రధ్ధగ చదివిన పిమ్మట చర్చకు
దిగవలె తొందరపడరాదండీ

కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!


చర్చకు తగిన సమయం బిచ్చుట
సంప్రదాయమని మరువరాదయా
ఎప్పటిలాగే ఆరువారముల
గడువు నిచ్చిరని గమనించుడయా

అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?


లాబీయింగులు సీమాంధ్రులకే
కలిసొస్తే యీ బిల్లొచ్చేనా
లేనిపోని యారోపణలెందుకు
చీటికిమాటికి చిందులెందుకు

కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!


కేంద్రము చేసిన దుష్కార్యములే
కాంగ్రెసు నిప్పుడు కాటికి పంపును
కాలము చెప్పును కలసి వచ్చునది
తెలంగాణకో సీమాంధ్రముకో

త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా


ఎందుకు లెండి హడావుడి పడటం
కేంద్రం‌ కరుణకు గడబిడపడటం
మహత్కార్యమో దుష్కార్యమ్మో
సమయం తీసుకు చర్చించవలె

కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!


కొత్తగడువులను పెట్టేటందుకు
మీరెవరయ్యా తప్పుగదయ్యా
మీ దూషణలకు చింతించరయా
మీ మెప్పులతో పనిలేదయ్యా

(ఇది శ్రీగుండువారి సాగదీత...కుట్రేనా?  అనే టపాకు స్పందన)