28, సెప్టెంబర్ 2016, బుధవారం

శ్రీరామ శ్రీరామ యనగానే చింతలన్నీ దూరమయ్యేను

శ్రీరామ శ్రీరామ యనగానే చింతలన్నీ దూరమయ్యేను
నోరార శ్రీరామ యనగానే కోరదగినది చేరువయ్యేను

నోరూరగా కాచి యెన్నెన్నో భూరుహంబున పండ్లు గమనించ
మూరెడెత్తున నూగుచుండంగ మోజుపడియును నందుకోలేడు
చేరి చెట్టు క్రింద మరుగుజ్జు చెట్టు దేముండును దోసమ్ము
శ్రీరామ యనలేక మూర్ఖుండు శ్రీరామకృప నందుకోలేడు

నిండు పున్నమరేయి జాబిల్లి పండువెన్నెల కాయుచుండంగ
బండనిద్దురవచ్చి రేయెల్ల పండు కొన్నాడా ముసుగెట్టి
ఉండియూ ఊడియూ గగనాన ఒక్కటే కద చందమామయ్య
తిండి నిద్దుర బ్రతుకు శ్రీరామదేవునికృప నందుకోలేదు

పిలచి పెండ్లివిందు భోజనము పెట్టగ పదిమంది తినుచుండ
కెలకుచుండు గాని జ్వరరోగి వలన కాకుండును భుజియింప
వలచి సిద్ధాన్నంబు తినలేని వాని వంటివాడు నాస్తికుడు
తలచి శ్రీరామ యనలేడో తాను రామకృప గొనలేడు